Asianet News TeluguAsianet News Telugu

వేరే కులపు యువకుడితో లేచిపోయిందని.. కుటుంబీకుల దారుణం

వేరే సామాజిక వర్గానికి చెందిన యువకుడితో దాదాపు నెల రోజులపాటు తిరిగి వచ్చిందని సొంత కుటుంబీకులే యువతిని ఉరేసి చంపారు. దాన్ని ఆత్మహత్యగా చిత్రించే ప్లాన్ చేసినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. యువతి తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

girl killed by family for eloping with different community man
Author
Bhopal, First Published Aug 12, 2021, 3:29 PM IST

భోపాల్: వేరే కులపు వ్యక్తిలో లేచిపోయిందని యువతిని కుటుంబ సభ్యులే పొట్టనబెట్టుకున్నారు. ఉరివేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం చేశారు. కానీ, ఫోరెన్సిక్ నిపుణుల రంగప్రవేశంతో హత్యగా తేలిపోయింది. యువతి తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్వాలియర్ నగరానికి చెందిన 20 ఏళ్ల యువతి వేరే కమ్యూనిటీ యువకుడు కొన్నాళ్లు చనువుగా ఉన్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ తరుణంలో జూన్ 5న ఇరువురూ ఇంటి నుంచి పరారయ్యారు. యువతి అదృశ్యమవడంతో ఆమె కుటుంబీకులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనక్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. 

దాదాపు నెల తర్వాత జులై 7న ఆ యువతి తిరిగి వచ్చింది. ఆమె తిరిగి రాగానే పోలీసులు ఆమెను విమెన్స్ షెల్టర్ హోమ్‌కు పంపారు. తిరిగి ఇంటికి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు ఆమెను కోరారు. జులై 31న తాను తన తల్లిదండ్రులతోనే ఉంటానని యువతి పోలీసులకు తెలియజేసి ఇంటికి వచ్చింది.

ఆగస్టు 2న యువతి తండ్రి పరుగున పోలీసు స్టేషన్‌కు చేరాడు. తన కూతురు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు తెలియజేశాడు. వెంటనే ఫోరెన్సిక్ బృందంతోపాటుగా పోలీసులు స్పాట్‌కు చేరుకుని వివరాలను ఆరా తీశారు. అక్కడి పరిస్థితులు కొంత అనుమానాస్పదంగా కనిపించాయి. యువతి ఆత్మహత్య చేసుకోలేదని, వేరే వాళ్లే ఉరిపోసి చంపారని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చింది. అనంతరం పోలీసుల దర్యాప్తులోనూ యువతి తండ్రి, ఇతర బంధువులు ఆత్మహత్య కాదని అంగీకరించారు. వారే ఉరిబిగించి చంపారని, ఆత్మహత్యగా చిత్రించాలని ప్లాన్ వేసినట్టు ఒప్పుకున్నారని పోలీసులు వివరించారు.

అనంతరం పోలీసులు యువతి తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. ఈ నేరంతో ప్రమేయమున్న యువతి బాబాయి, మరో ఇద్దరు తమ్ముళ్లు పరారీలో ఉన్నారు. వీరిని అరెస్టు చేయడానికి పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios