మహారాష్ట్రలో ఓ బాలిక తాను కిడ్నాప్ అయ్యానని సోదరుడికి వాట్సాప్‌లో వాయిస్ మెస్సేజీ పెట్టింది .ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌తో మహారాష్ట్ర నుంచి కోల్‌కతాకు ఫ్లైట్‌లో వెళ్లినట్టు పోలీసులు వివరించారు.  

ముంబయి: మహారాష్ట్రలో ఓ బాలిక తాను కిడ్నాప్‌నకు గురైనట్టు కుటుంబానికి చెప్పింది. సోదరుడికి వాట్సాప్‌లో వాయిస్ మెస్సేజీ చేసింది. ఆ కుటుంబం ఆందోళనలకు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కానీ, ఆ తర్వాత తేలిందేమిటంటే.. ఆ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కోల్‌కతాకు చెక్కేసింది.

మహారాష్ట్రలోని పాల్‌గడ్‌కు చెందిన బాలిక ఈ ప్లాన్ వేసింది. ఆ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు వెళ్లినట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, పాల్‌గడ్‌లోని విరార్ ఏరియాకు చెందిన 17 ఏళ్ల బాలిక ఓ కంపెనీలో హౌజ్ కీపింగ్ సెక్షన్‌లో పని చేస్తున్నది. శుక్రవారం ఆఫీసుకు వెళ్లిన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. వారికి తెలిసిన ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం వెతికారు. బంధువులను ఆరా తీశారు. అదే సమయంలో ఆ బాలిక తన సోదరుడి వాట్సాప్‌నకు ఓ వాయిస్ మెస్సేజీ పంపింది. తాను కిడ్నాప్‌నకు గురైనట్టు ఆమె అందులో పేర్కొంది.

Also Read: ఫోన్ మాట్లాడుతూ డ్రైవర్.. బ్రిడ్జీని ఢీకొన్న బస్సు.. ఛత్తీస్‌గడ్‌లో 26 మందికి గాయాలు

దీంతో ఆ బాలిక కుటుంబం సభ్యులు గాబరాపడ్డారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కోల్‌కతాకు ఫ్లైట్‌లో వెళ్లినట్టు పోలీసులు ఆ కుటుంబానికి వెల్లడించారు. 

పోలీసులు ఐపీసీలోని 363 సెక్షన్ (కిడ్నాప్) కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిని పట్టుకుని ఇంటికి తీసుకురావడానికి పోలీసులు మరో యాక్షన్ తీసుకున్నారు. ఇద్దరు పోలీసులు కోల్‌కతాకు వెళ్లారు.