తన ఫోటోలను మాజీ ప్రేమికుడు వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడని.. ఓ యువతి  ఆత్మహత్య చేసుకొన్న సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.  పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం సమీపంలోని కలక్కాడు ప్రాంతానికి చెందిన యువతి జీవా(21) ఓ ప్రైవేటు  ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో ఆమెకు  అదే ప్రాంతానికి చెందిన ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కన్నన్ అనే యువకుడిని ప్రేమించింది. కొద్ది రోజుల పాటు వీరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు.. ఫోన్ లో ఫోటోలు కూడా దిగేవారు. అయితే.. ఎందుకో.. అతని ప్రవర్తన జీవాకి నచ్చలేదు. దీంతో.. అతనికి బ్రేకప్ చెప్పేసి.. దూరంగా ఉంటోంది.

కన్నన్ ఎంత ప్రయత్నించినా.. జీవా మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు.దీంతో.. గతంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పటి ఫోటోలను కన్నన్ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. దీంతో.. మనస్థాపానికి గురై జీవా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.