బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. బాగేపల్లి తాలూకాలోని యగవమద్దలఖాన గ్రామంలో ప్రేమ వ్యవహారం గ్రామంలో కక్షలకు కారణమైంది. యువకుడి హత్యతో గ్రామంలో విధ్వంసకాండ సాగింది. యువకుడిని హత్య చేసిన కేసులో వెంకటేష్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.... హరీష్ అనే యువకుడు వెంకటేష్ కూతురితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పది రోజుల క్రితం ఇద్దరు వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. 

ఇరు కుటుంబాలవాళ్లు వాళ్లు పారిపోయిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని పట్టుకుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇరు కుటుంబాలవాళ్లు పంచాయతీ చేసుకుని ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. 

అయితే, ఆ తర్వాత రెండు రోజులకు వెంకటేష్ కూతురు ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు మరణంతో ఆగ్రహించిన వెంకటేష్ శుక్రవారం రాత్రి హరీష్ రాగానే అతనిపై కత్తితో దాడి చేశాడు. 17 సార్లు అతన్ని కత్తితో పొడిచాడు. ఆ తర్వాత నిందితులు పారిపోయారు. దాంతో హతుడి బంధువులు వారి ఇళ్లపై దాడి చేశారు. ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేశారు. 

విధ్వంసం కేసులో పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు.