Congress : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మరింతగా డీలా పడింది. గిరీష్ చోడంకర్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
Congress: కాంగ్రెస్ పార్టీ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి. దేశంలో తిరుగులేని పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్.. ఇప్పుడు దేశంలో జాతీయ ప్రతిపక్ష పార్టీ హోదాను నిలబెట్టుకోవడం కోసం పోరాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు రాబట్టింది. ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ తన పదవికి రాజీనామా చేశారు.
చోడంకర్ తన రాజీనామాను ఏఐసీసీకి పంపినట్లు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గోవా డెస్క్ ఇన్‌చార్జి దినేష్ గుండూరావు మంగళవారం నాడు మీడియాకు వెల్లడించారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో చోడంకర్ కాంగ్రెస్‌కు సారథ్యం వహించారు. కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకోగలిగింది. దాని మిత్రపక్షం గోవా ఫార్వర్డ్ పార్టీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. అయితే బీజేపీ 20 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. గత గురువారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, చోడంకర్ తన పార్టీ పేలవమైన ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ వైదొలగాలనే నిర్ణయాన్ని ప్రతిపాదించారు.
చోడంకర్ రాజీనామా ఆమోదం పొందుతుందని, ఆయన స్థానంలో కొత్త వ్యక్తి పార్టీ పగ్గాలు చేపడుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. "సంకల్ప్ అమోంకర్, అలీక్సో సిక్వేరా మరియు ఎల్విస్ గోమ్స్ వంటి నాయకులు గోవా కాంగ్రెస్ చీఫ్ రేసులో ముందంజలో ఉన్నారు" అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమోంకర్ మరియు సిక్వేరా గెలుపొందగా, మాజీ బ్యూరోక్రాట్ అయిన గోమ్స్ పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు.
పోల్ మార్గోవ్ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న సీనియర్ నాయకుడు దిగంబర్ కామత్‌ను కోస్తా రాష్ట్రంలో పార్టీ అగ్ర పదవికి కాంగ్రెస్ పరిగణించే అవకాశాన్ని కూడా ఉందని సంబంధిత వర్గాల సమాచారం. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. అప్పుడు 13 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ కొన్ని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. ఈసారి, 2017 నాటి అపజయాన్ని నివారించడానికి కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాన్ని ఆశించింది, కానీ మెజారిటీని గెలుచుకోవడంలో విఫలమైంది. పంజాబ్ లో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఏకంగా 90 కి పైగా స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పంజాబ్ లో కాంగ్రెస్ దారుణ ఫలితాలకు అంతర్గత పోరుతో పాటు కీలక నేతల వ్యాఖ్యలు కొంప ముంచాయని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి కూడా భారీ స్పందన లభించింది. కానీ అవి ఓట్ల రూపంలోకి మారకపోవడంతో గతంలో సాధించిన స్థానాలను కూడా కోల్పోయింది. కేవలం రెండు స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది.
