గులాం నబీ ఆజాద్కు మద్ధతుగా జమ్మూ కశ్మీర్ లో 64 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆజాద్ సెప్టెంబర్ 4న బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆ రోజే తన నూతన పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన సీనియర్ రాజకీయ నాయకుడు గులాం నబీ ఆజాద్ మద్దతుగా జమ్మూ కశ్మీర్ లోని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 64 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమ్మతి నేతలు తమ ఉమ్మడి రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
రాజీనామా చేసిన వారిలో కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్, మాజీ మంత్రులు మనోలాల్ శర్మ, బల్వాన్ సింగ్, అబ్దుల్ మజిద్ సహా పలువురు ఉన్నారు. ఆజాద్కు మద్ధతుగా తమ రాజీనామా లేఖను సోనియాజీకి పంపినట్లు తారా చంద్ తెలిపారు. సోమవారం నలుగురు నాయకులతో పాటు 12మంది కార్యకర్తలు ఆజాద్ కు మద్ధతుగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే..
పార్టీకి గట్టి ఎదురు దెబ్బ
రాజీనామా చేసిన తరువాత విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. తన రాజీనామా లేఖను చదివిన మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ చదివి వినిపించారు. తారాచంద్, మాజీ మంత్రి అబ్దుల్ మజీద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ సహా ఇతర నాయకులు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకపోవడంతో జమ్మూ కాశ్మీర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని బల్వాన్ సింగ్ పేర్కొన్నారు. కాశ్మీర్ లో జాతీయ స్థాయి పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆజాద్ నిర్ణయం ప్రతి ఒక్కరికీ స్పూర్తి నింపుతుందని ఆయన అన్నారు. ఆజాద్ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ మరోసారి పూర్తి రాష్ట్ర హోదాను తిరిగి పొందగలదని తాము విశ్వసిస్తున్నామని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో ప్రాంతాలు, వర్గాల మధ్య దూరాన్ని తగ్గించే స్వేచ్ఛ ప్రజలకు మాత్రమే ఉందని బల్వాన్ సింగ్ అన్నారు. ఆయన (ఆజాద్) దార్శనికత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో దోహదపడుతుందని తాము విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు.
ఐదు దశాబ్దాల అనుబంధం
రాజీనామా చేసిన అనంతరం పార్టీ నేతలు మాట్లాడూతూ.. తమకు దశాబ్దాలుగా పార్టీతో అనుబంధం ఉందనీ, జమ్మూ, కాశ్మీర్‌లో పార్టీని విస్తరించడానికి తమ శక్తి, వనరులను మొత్తం వెచ్చించామని అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు.. అధికారం సాధించలేకపోయామని, లోపాలు గుర్తించి పార్టీకి చికిత్స చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఆజాద్‌కు మేమంతా మద్దతిస్తున్నామని, జమ్మూ కాశ్మీర్‌ను ఉజ్వల భవిష్యత్తు దిశగా తీసుకెళ్లడంలో ఆయన వెంట ఉంటామని పార్టీ రాష్ట్ర శాఖ నేతలు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్కు గత శుక్రవారం నాడు రాజీనామా చేశారు. తాను కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. గాంధేయుల కుటుంబ వల్లనే రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ నాశనమైందని.. ఆయన లీడర్గా సెట్కారని విమర్శించారు. జీ23 నేతలతో కలిసి తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన తర్వాత.. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, కానీ తాను ఎప్పుడూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని భావించలేదని అన్నారు. కానీ తన ఇంట్లో నుంచి తననే బలవంతంగా వెళ్లిపోయే పరిస్థితులను సృష్టించారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే తరుణంలో అస్వస్థతతో బాధపడుతున్న కాంగ్రెస్కు డాక్టర్ తో వైద్యం చేయకుండా.. కంపౌండర్ చికిత్స చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
ఆ రోజు పార్టీ ప్రకటన !
ఇదిలా ఉంటే.. గులాం నబీ ఆజాద్ సెప్టెంబర్ 4న బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. ఈ సభ జమ్ములోని సైనిక్ కాలనీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఆ బహిరంగసభలోనే ఆజాద్ తాను పెట్టబోయే నూతన పార్టీ పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్నది.
