Asianet News TeluguAsianet News Telugu

రాజీనామా కంటే.. రాహుల్ పై దాడే బాధపెట్టిందా?.. ఆజాద్ అసలు రంగు బయటపడింది: జైరాం రమేశ్

గులాం నబీ ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ విచారం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, తన రాజీనామా లేఖలో ఆజాద్.. రాహుల్ గాంధీపై మండిపడ్డారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి రాహుల్ గాంధే కారణం అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే నాయకత్వంపై వ్యక్తిగత దాడికి దిగి ఆజాద్ తన నిజమైన క్యారెక్టర్‌ను బయటపెట్టుకున్నారని కాంగ్రెస్ మండిపడింది.

ghulam nabi azad revealed his true character by personal attack congress slams after his resignation
Author
First Published Aug 26, 2022, 5:22 PM IST

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ దిగ్గజ నేతగా ఎదిగిన గులాం నబీ ఆజాద్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేదే. కేంద్ర మాజీ మంత్రిగా, జమ్ము కశ్మీర్ మాజీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి అపార అనుభవం సాధించిన గులాం నబీ ఆజాద్‌ను కోల్పోవడం పార్టీకి దెబ్బే. అందుకే ఆయన రాజీనామా పై కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. కానీ, అనూహ్యంగా గులాం నబీ ఆజాద్ రాజీనామాపై చింతిస్తూనే ఆయన తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీపై దాడి చేయడాన్ని నిరసించింది. ఎంతగానంటే ఆయనపై ఎదురుదాడికి దిగేంతగా ఆ పార్టీ బాధపడినట్టు స్పష్టం అవుతున్నది.

కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ గులాం నబీ ఆజాద్ నిష్క్రమణపై స్పందిస్తూ.. విషపూరితంగా వ్యక్తిగత దాడికి దిగడం ద్వారా గులాం నబీ ఆజాద్ అసలు రంగు బయట పడిందని పేర్కొన్నారు. (Ghulam Nabi Azad - GNA) జీఎన్ యొక్క డీఎన్ఏ ‘మోడీ’ అయినట్టు తెలుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీ వైపు గులాం నబీ ఆజాద్ ఆకర్షితువుడు అవుతున్నట్టు పరోక్షంగా నిందించారు.

కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు ఉన్నతమైన గౌరవం ఇచ్చిందని, కానీ, ఆయన నాయకత్వంపై వ్యక్తిగత దాడికి దిగి ఆయన అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. ముందుగా పార్లమెంటులో మోడీ కన్నీరు, ఆ తర్వాత పద్మ విభూషణ్, ఇప్పుడు ఇది అంటూ ఏకరువు పెట్టారు. ఇదంతా కాకతాళియం కాదని, ఒకరికి మరొకరు సహకరించుకుంటూనే వ్యవహారం సాగుతున్నదని ఆరోపించారు.

రాజ్యసభ పదవీ కాలం ముగిసినప్పుడు గులాం నబీ ఆజాద్‌కు వీడ్కోలు పలుకుతూ ప్రధాని నరేంద్ర మోడీ కన్నీరు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

గులాం నబీ ఆజాద్ ఈ రోజు కాంగ్రెస్‌కు భారీ ఝలక్ ఇచ్చారు. ఆయన పార్టీ పదవులు అన్నింటితోపాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఐదు పేజీల రాజీనామా లేఖ రాశారు. ఇందులో పార్టీతో తన జీవిత ప్రయాణం గురించి, పార్టీ సాధించిన విజయాలు, అపజయాలను ప్రస్తావించారు. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో సోనియా గాంధీ తీరును మెచ్చుకుంటూనే ప్రస్తుత పరిణామాలపై విమర్శలు చేశారు. కొన్ని సూచనలూ చేశారు. కాగా, రాహుల్ గాంధీపై మాత్రం విరుచుకుపడ్డారు. ఆయన తన రాజీనామా లేఖలో పార్టీలో ప్రతికూల పరిస్థితులు, తప్పుడు పద్ధతులను ఎత్తి చూపారు. తన రాజీనామాకు పార్టీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులనే కారణంగా చూపించారు. ఐదు పేజీల తన రాజీనామా లేఖలో ఎక్కువగా పార్టీపై ఘాటు విమర్శలు ఉన్నాయి. ఆయన పేర్కొన్న లోపాలను కారణంగా చూపి రాజీనామా చేస్తున్నట్టు వివరించారు.

రాహుల్ గాంధీ పిల్ల చేష్టల కారణంగా 2014లో కాంగ్రెస్ ఓడిపోయిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉండే సంప్రదింపుల వ్యవస్థను సర్వం నాశనం చేశారని మండిపడ్డారు. ఆయన చుట్టూ కొత్తగా సైకోల కోటరీ ఒకటి ఏర్పడిందని, ఇప్పుడు వారే పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారని విమర్శించారు. ఆయన గార్డులు, పర్సనల్ అసిస్టెంట్లు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు.

గులాం నబీ ఆజాద్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్పందించారు. గులాం నబీ ఆజాద్ రాజీనామా దురదృష్టకరం అని వివరించారు. అంతేకాదు విచారకరం అని వివరించారు. అదీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మొత్తం కాంగ్రెస్ అంతా కూడా ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజనల నేపథ్యంలో బీజేపీపై పోరాడుతున్న సమయంలో గులాం నబీ ఆజాద్ రాజీనామా చేయడం విచారకరం అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios