రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ లా విద్యార్థి శవమై తేలాడు. ఇంటి యజమానే... యువకుడిని హత్య చేసి... ఇంట్లోనే పూడ్చి పెట్టినట్లు తేలింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బాలియాకు చెందిన పంకజ్ కుమార్ సింగ్(27) లా విద్యను అభ్యసిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సహిబాబాద్‌లోని గిరిధర్ ఎన్‌క్లేవ్‌లోని మున్నా యాదవ్ ఇంట్లోని మొదటి అంతస్తులో అద్దెకు ఉన్నాడు. ఆ తర్వాత మరో ఇంటికి మారాడు. అయితే, ఈ నెల మొదట్లో ఇంటి నుంచి బయటకు వెళ్లిన పంకజ్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.

అతని ఆచూకీ లభించకపోవడంతో... కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కాగా... పోలీసుల దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పంకజ్ కుమార్ అదృశ్యం అయిన రోజు నుంచి ఆ ఇంటి యజమాని, అతని కుటుంబసభ్యులు కూడా కనిపించకపోయిన విషయాన్ని గుర్తించారు. అతడి ఇంటిని పరిశీలించిన పోలీసులు.. ఇంటిలో ఓ చోట కొత్తగా ప్లాస్టింగ్ చేసిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అక్కడ తవ్వి చూడగా పంకజ్ మృతదేహం కనిపించినట్టు ఘజియాబాద్ సిటీ ఎస్పీ మనీశ్ మిశ్రా తెలిపారు. ఆరు అడుగుల లోతులో పంకజ్ మృతదేహాన్ని పాతిపెట్టారని, మృతదేహం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉందని పేర్కొన్నారు.
 
ఐఎంఈ ఘజియాబాద్‌లో న్యాయవిద్యను అభ్యసిస్తున్న పంకజ్ నెల రోజుల క్రితం మున్నా యాదవ్ ఇంటిలో అద్దెకు దిగాడు. యాదవ్ తన భార్య సులేఖ, నలుగురు పిల్లలతో కలిసి రెండో అంతస్తులో నివసిస్తున్నాడు. అయితే, ఆ ఇంట్లో 15 రోజులు మాత్రమే ఉన్న పంకజ్ ఆ తర్వాత మరో ఇంటికి మారాడు.

మున్నా యాదవ్ పిల్లలకు పంకజ్ పాఠాలు చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తమతో కలిసి అదే అంతస్తులో ఉండాలని మున్నా దంపతులు పంకజ్‌ను బలవంతం చేశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ కారణంగా అతడు మరో ఇంటికి మారి ఉంటాడని అతడి తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు.

తమ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయాడన్న ఒకే ఒక్క కారణంతోనే అతనిని చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా...పంకజ్ ని చంపి.. ఇంట్లోనే పాతిపెట్టి... తర్వాత యజమాని, అతని కుటుంబసభ్యులు వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.