లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ టెక్కీ తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగానే టెక్కీ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘజియాబాద్‌లోని ఇంద్రాపురంలో  34 ఏళ్ల సుమిత్ కుమార్ నివాసం ఉంటున్నాడు. అతనికి 32 ఏళ్ల అనూష బాల అనే భార్య ఉంది.  ఐదేళ్ల కొడుకు ప్రత్మేష్, అరవ్, అకృతి అనే ఇద్దరు కవలలు కూడ ఈ దంపతులకు ఉన్నారు.

 గత ఏడాది డిసెంబర్ మాసంలో  సుమిత్ కుమార్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు.  సుమిత్ కుమార్ భార్య బాల ఓ ప్లే స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. సుమిత్ కుమార్  ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత నుండి ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.

దీంతో ఆత్మహత్య చేసుకోవాలని ఆయన భావించాడు. దీంతో  భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసిన తర్వాత సుమిత్ కుమార్  సైనేడ్ మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆత్మహత్యకు పాల్పడే ముందు సుమిత్ కుమార్  ఓ వీడియోను రికార్డు చేసి తన ఫ్యామిలీ గ్రూప్‌లో  పోస్టు చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలను హత్యచేసినట్టుగా ఆయన చెప్పారు. అంతేకాదు తాను కూడ ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఈ గ్రూపులో పోస్ట్ పెట్టాడు.

ఈ  వీడియోను చూసిన సుమిత్ కుమార్ సోదరి, బాల సోదరుడు వెంటనే అక్కడికి చేరుకొన్నారు.  అయితే అప్పటికే ఆ ఇంటి తలుపులు లాక్ చేసి ఉన్నాయి. వీరిద్దరూ కూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు పగులగొట్టారు.

ఇంట్లోకి వెళ్లి చూస్తే  సుమిత్‌కుమార్‌తో పాటు ఆయన భార్య ముగ్గురు పిల్లల మృతదేహలు ఇంట్లో పడి ఉన్నాయి. సుమిత్ కుమార్  తల్లిదండ్రులు కూడ ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే వారం రోజు క్రితం ఓ పెళ్లిలో పాల్గొనేందుకు  సుమిత్ తల్లిదండ్రులు వెళ్లారు. ఇదే సమయాన్ని చూసుకొని  సుమిత్ కుమార్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.