గెట్ అవుట్ రవి.. తమిళనాడులో గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు.. మరింతగా ముదురుతున్న వివాదం..!
తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింతగా ముదురుతుంది. తాజాగా గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింతగా ముదురుతుంది. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగం వేళ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ గీతం వినిపించకముందే.. గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే తాజాగా గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా తమిళనాడులో పెద్ద ఎత్తున పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పశ్చిమ చెన్నైలోని వల్లువర్ కొట్టం, అన్నాసాలై ప్రాంతాల్లో ‘‘#GetoutRavi’’ అని ఉన్న పోస్టర్లు కనిపించాయి. గవర్నర్‌కు, సర్కార్‌కు మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. గత కొన్ని రోజులుగా ట్విట్టర్‌లో ‘‘#గెటౌట్ రవి’’ టాప్ ట్రెండ్‌గా మారింది.
కోయంబత్తూరులో గవర్నర్ రవికి వ్యతిరేకంగా తంథై పెరియార్ ద్రవిడర్ కజగం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. అక్కడ ఆందోళనకారులు రవి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘటనను ఖండిస్తూ మరో చోట స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ఆయా కార్యకర్తలను వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి అసెంబ్లీలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ.. సభ చరిత్రలో ఇది అపూర్వమైన సంఘటన అని అన్నారు. ‘‘సాధారణంగా మా నాయకుడు (స్టాలిన్) తన ప్రత్యుత్తరాలతో అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని పరిగెత్తించేలా చేస్తారు. కానీ ఈసారి అతను గవర్నర్‌ను పరుగెత్తేలా చేశారు. మన హక్కులు దెబ్బతిన్నప్పుడల్లా ఆందోళన వ్యక్తం చేసే మొదటి ముఖ్యమంత్రి స్టాలిన్’’ అని ఉదయనిధి అన్నారు.
మరోవైపు పుదుకోట్టైలో గవర్నర్ ఆర్ఎన్ రవిని అభినందిస్తూ స్థానిక బీజేపీ కార్యకర్తలు పోస్టర్లు వేశారు. బీజేపీకి మద్దతుగా ఉండే ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా.. గవర్నర్ రవికి మద్దతుగా నిలుస్తున్నాయి. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
సభ నుంచి గవర్నర్ వాకౌట్..
సభను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ఆర్ఎన్ రవి మాట్లాడారు. తన ప్రసంగంలో ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాలోని కొన్ని భాగాలను రవి దాటవేశారు. కొన్ని చోట్ల గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రభుత్వం అందజేసిన ప్రసంగం కాకుండా సొంతంగా మాట్లాడారని డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్.. అసెంబ్లీలో సాంప్రదాయంగా గవర్నర్ చేసే ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే ఆన్ రికార్డులో ఉంచాలని, గవర్నర్ చేర్చిన వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌ను కోరారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.