ఎన్నికల వేళ మరో బీజేపీ ఎంపీ నోరు జారారు. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వివాదంలో  ఇరుక్కున్నారు. తాజాగా... మరో ఎంపీ.. సంచలన కామెంట్స్ చేశారు.

బీజేపీ ఎంపీ మనోజ్ సిన్హా.. తమ పార్టీ కార్యకర్తలను విమర్శించిన వారి కళ్లు పీకేస్తా అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.ఘాజీపూర్ నుంచి పోటీ చేస్తున్న ఆయన గురువారం సైద్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ మా కార్యకర్తల వైపు ఎవరైనా వేలెత్తి చూపితే.. వారి వేలు సురక్షితంగా ఉండదని హెచ్చరించారు.

 ‘‘మా పార్టీ(బీజేపీ) కార్యకర్తలు ఆణిముత్యాలు. నేరాలు చేసి సంపాదించాలనే ఆలోచన వారికి లేదు. అలాంటి వారిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. ఎవరైనా మా కార్యకర్తల వైపు వేలు చూపిస్తే.. ఆ వేలిని నాలుగంటే నాలుగు గంటల్లోనే విరిచేస్తా. పూర్వాంచల్‌ నేరగాళ్లు ఘాజీపూర్‌ సరిహద్దు దాటి మా వాళ్లపై అవాకులు చవాకులు పేలితే వారి కళ్లు పీకేస్తా.’’ అని ఆయన పేర్కొన్నారు. 

కాగా... మనోజ్ సిన్హా చేసిన కామెంట్స్ పై ప్రతి పక్ష పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక ఎంపీ మాట్లాడాల్సిన పద్ధతి ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.