ప్రముఖ రచయిత్రి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూత..
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత్రి గీతా మెహతా అనారోగ్యంతో చనిపోయారు. 80 ఏళ్ల వయస్సులో ఆమె తన ఢిల్లీ నివాసంలో కన్నుమూశారు. ఆమె 'కర్మ కోలా', 'స్నేక్ అండ్ లాడర్స్', 'ఎ రివర్ సూత్ర', 'రాజ్', 'ది ఎటర్నల్ గణేశ' వంటి రచనలు చేశారు.

ప్రముఖ రచయిత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూశారు. ప్రస్తుతం 80 ఏళ్ల వయస్సున్న ఆమె..వృద్దాప్య సంబంధిత అనారోగ్యం వల్ల శనివారం ఢిల్లీలోని తన నివాసంలో చనిపోయారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నారు. ప్రచురణకర్త అయిన భర్త సోనీ మెహతా గతంలో మరణించారు.
ప్రముఖ రచయిత్రి, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, జర్నలిస్ట్ అయిన గీతా మెహతా.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, అలాగే వ్యాపారవేత్త ప్రేమ్ పట్నాయక్ ల అక్క. 1943లో ఢిల్లీలో బిజూ పట్నాయక్, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు జన్మించిన ఆమె భారత్ లోనూ, యునైటెడ్ కింగ్ డమ్ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోనూ చదువుకున్నారు.
'కర్మ కోలా', 'స్నేక్ అండ్ లాడర్స్', 'ఎ రివర్ సూత్ర', 'రాజ్', 'ది ఎటర్నల్ గణేశ' వంటి పుస్తకాలు రచించారు. మెహతా తన తమ్ముడు నవీన్ పట్నాయక్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. అంతకుముందు భువనేశ్వర్ పర్యటన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ లాంటి సీఎం దొరకడం ఒడిశా ప్రజల అదృష్టమన్నారు.
కాగా.. గీతా మెహతా మరణం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఆమె తెలివితేటలు, రచనతో పాటు సినిమా నిర్మాణంపై మక్కువకు పెట్టింది పేరు. ప్రకృతి, జలసంరక్షణ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఈ విషాద సమయంలో నవీన్ పట్నాయక్ కు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఒడిశా గవర్నర్ గణేషి లాల్ కూడా ఆమె మృతికి సంతాపం తెలిపారు. ‘‘సీఎం నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ ఆంగ్ల రచయిత్రి గీతా మెహతా మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. బాధిత కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ లో పోస్ట్ చేశారు. కాగా.. మెహతా మృతి పట్ల పలువురు ఒడిశా మంత్రులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.