Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలో మహిళలకు భద్రత, గౌరవం లేదు.. కాషాయ పార్టీకి రాజీనామా చేసిన నటి గాయత్రి

భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ప్రముఖ నటి గాయత్రి రఘురామ్ తాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా గాయత్రి రఘురామ్ మంగళవారం ప్రకటించారు.

Gayathri Raghuram Quits BJP And slams annamalai
Author
First Published Jan 4, 2023, 2:10 PM IST

భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేయబడిన ప్రముఖ నటి గాయత్రి రఘురామ్ తాజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టుగా గాయత్రి రఘురామ్ మంగళవారం ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. నిజమైన కార్యకర్తలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. తమిళనాడు బీజేపీలోని మహిళలకు భద్రత, సమాన హక్కు, గౌరవం లేదని ఆరోపించారు. తాను పార్టీ వీడటానికి రాష్ట్ర బీజేపీ చీఫ్ కె అన్నామలై కారణమని చెప్పారు. అయితే ఆమె ఆరోపణలను రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత ఒకరు తోసిపుచ్చారు. ఆమె పార్టీని వీడటం వల్ల నష్టమేమి లేదన్నారు. ఆమె ఆరోపణలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. 

 ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ తమిళ డెవలప్‌మెంట్ బీజేపీ యూనిట్‌కు అధ్యక్షురాలుగా ఉన్న గాయత్రి రఘురామ్‌ను అన్నామలై పార్టీ నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. పార్టీకి చెడ్డపేరు తెచ్చే కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే  గాయత్రిని పదవి నుంచి తొలగించి సస్పెండ్ చేయడానికంటే కొద్ది రోజుల ముందు..ఆమె ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులను కలిశారని  బీజేపీ స్పోర్ట్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెల్ అధ్యక్షుడు అమర్ ప్రసాద్ ఆరోపించారు. బీజేపీలో ద్రోహులకు స్థానం లేదని కూడా కామెంట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన గాయత్రి.. అది తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని, వారు ఎవరిని ఆహ్వానించారనే విషయం తనకు తెలియదని చెప్పారు. 

అయితే తాజాగా బీజేపీ గుడ్ బై చెప్పిన గాయత్రి రఘురామ్.. మోదీ, అమిత్ షాలు తనకు ఎప్పటికీ స్ఫూర్తి అని అన్నారు. ‘‘మహిళలపై విచారణ, అలాగే సమాన హక్కులు, గౌరవం ఇవ్వనందుకు తమిళనాడు బీజేపీకి రాజీనామా చేయాలని నేను భారమైన హృదయంతో నిర్ణయం తీసుకున్నాను. అన్నామలై నాయకత్వంలో మహిళలు సురక్షితంగా లేరు. బయటి వ్యక్తిగా ట్రోల్ చేయబడటం నాకు మంచిదనిపిస్తోంది’’ అని గాయత్రి ట్విట్టర్‌లోని పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను ట్యాగ్ చేశారు. 

 


‘‘నిజమైన కార్యకర్తలను ఎవరూ పట్టించుకోరు. నిజమైన కార్యకర్తలను తరిమికొట్టడమే అన్నామలై ఏకైక లక్ష్యం. బీజేపీకి శుభాకాంక్షలు. మోదీ జీ మీరు ప్రత్యేకమైనవారు. మీరు జాతి పితామహుడు, మీరు ఎల్లప్పుడూ నాకు విశ్వగురువు, గొప్ప నాయకుడు. అమిత్ షా జీ మీరు ఎల్లప్పుడూ నా చాణక్య గురువుగా ఉంటారు’’ అని కూడా గాయత్రి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios