ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం దివా జైమిన్ షాతో ఆదివారం (మార్చి 12) నిశ్చితార్థం జరిగింది.

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ నిశ్చితార్థం దివా జైమిన్ షాతో ఆదివారం (మార్చి 12) నిశ్చితార్థం జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే జీత్, దివాల నిశ్చితార్థ వేడుక పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం కాబట్టి.. చాలా తక్కువ వివరాలు ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి. వీరి నిశ్చితార్థ వేడుకకు సంబంధించి ఓ ఫోటో వెలుగులోకి వచ్చింది. 

జిత్ అదానీ.. గౌతమ్ అదానీ చిన్న కుమారుడు. జీత్ అదానీ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్ నుంచి తన చదువును పూర్తి చేశారు. జీత్ 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. ప్రస్తుతం గ్రూప్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదానీ గ్రూప్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..జీత్ గ్రూప్ సీఎఫ్‌వో కార్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు.స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, రిస్క్ అండ్ గవర్నెన్స్ పాలసీలను చూస్తున్నారు. 

అదానీ ఎయిర్‌పోర్ట్స్ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్ ల్యాబ్స్‌కు కూడా జీత్ నేతృత్వం వహిస్తున్నారు. అదానీ డిజిటల్ ల్యాబ్స్‌.. అదానీ గ్రూప్ వ్యాపారాల వినియోగదారులందరికీ అందించడానికి ఒక సూపర్ యాప్‌ను రూపొందించడానికి సిద్ధంగా ఉంది. 

ఇక, దివా జైమిన్ షా విషయానికి వస్తే.. ఆమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. జైమిన్ షా‌కు డైమండ్ కంపెనీ సి దినేష్ అండ్ కో-ప్రైవేట్ లిమిటెడ్‌లో భాగస్వామ్యం ఉంది. ఈ డైమండ్ కంపెనీ ముంబై, సూరత్‌లలో ఉంది. ఈ కంపెనీని చిను దోషి, దినేష్ షా స్థాపించారు. ప్రస్తుతం జిగర్ దోషి, అమిత్ దోషి, యోమేష్ షా, జైమిన్ షా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు.