Asianet News TeluguAsianet News Telugu

ఒకే వేదికపై గౌతమ్ అదానీ, అశోక్ గెహ్లాట్.. రాజస్తాన్‌కు పోటెత్తిన పెట్టుబడి.. శత్రువు మిత్రుడయ్యాడా?: బీజేపీ

తరచూ అదానీ, అంబానీలను విమర్శించే కాంగ్రెస్ శుక్రవారం అనూహ్య కార్యక్రమం నిర్వహించింది. పెట్టుబడులపై రాజస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో గౌతమ్ అదానీ, సీఎం అశోక్ గెహ్లాట్ ఒకే వేదికపై కూర్చున్నారు. సీఎం గెహ్లాట్ సమక్షంలో అదానీ రూ. 65వేల కోట్ల పెట్టుబడులు రాజస్తాన్‌లో పెడుతామని ప్రకటించారు.

gautam adani investements to congress state rajasthan, adani, ashok gehlot shares stage
Author
First Published Oct 8, 2022, 12:57 PM IST

న్యూఢిల్లీ: ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలను కాంగ్రెస్ తరుచూ విమర్శిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఈ పారిశ్రామికవేత్తలపైనా కామెంట్లు సంధిస్తూ ఉంటుంది. మోడీ తన క్యాపిటలిస్టు మిత్రులకు లోన్‌లు మాఫీ చేస్తుంటాడు అని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ ముఖ్యంగా రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ, శుక్రవారం రాజస్తాన్‌లో ఒక అరుదైన సన్నివేశం కనిపించింది. రాజస్తాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్, గౌతమ్ అదానీ ఒకే వేదికపై  కనిపించారు. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోని ఈ రాష్ట్రంలో సుమారు రూ. 65 వేల కోట్ల పెట్టుబడులను అదానీ ప్రకటించారు. పది వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఫెసిలిటీ, సిమెంట్ ప్లాంట్ విస్తరణ, జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నవీకరించే పనులను వచ్చే ఐదేళ్లు లేదా ఏడేళ్ల కాలానికి ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే ఐదు లేదా ఏడేళ్లలో రాజస్తాన్‌లో రూ. 65 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు గౌతమ్ అదానీ ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రంలో 40 వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏర్పడుతాయని తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు ప్రాజెక్టులపైనా పని చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో రెండు మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు పెడతామని, ఉదయ్‌పూర్‌లో క్రికెట్ స్టేడియం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని పేర్కొన్నారు.

కాగా, అశోక్ గెహ్లాట్ తన ప్రసంగంలో గౌతమ్ అదానీని గౌతమ్ భాయ్ అని సంభోదించారు. ఆయన వ్యాపార సామర్థ్యంపై ప్రశంసలు కురిపించారు. ధీరూబాయ్ అంబానీ, గౌతమ్ భాయ్ వంటి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను గుజరాత్ రాష్ట్రం తయారు చేసిందని వివరించారు.

అదానీ, గెహ్లాట్ వేదిక పంచుకుంటున్న వీడియో సెన్సేషనల్ అయింది. ఈ ఫొటో ఆధారంగా బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించింది. డబ్బులు వస్తాయని కాంగ్రెస్ తన శత్రువును ఈ రోజు మిత్రుడిగా చేసుకున్నదా? అని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీష్ పూనియా విమర్శించారు.

కాగా, గాంధీలకు వ్యతిరేకంగా రాజస్తాన్‌లో ఓ తిరుగుబాటు వేళ్లూనుకుంటున్నదని, అందుకే గెహ్లాట్.. అదానీని ఆహ్వానించారని, తన పక్కనే కూర్చోబెట్టుకున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. అదానీ, అంబానీలను విమర్శించే రాహుల్ గాంధీకి ఇది సూటిగా ఇచ్చిన సందేశమని పేర్కొన్నారు.

ఈ సమావేశానికి కొన్ని గంటల ముందు రాహుల్ గాంధీ క్యాపిటలిస్టు మిత్రులు అంటూ ట్వీట్ చేయడం గమనార్హం. పేదలు లోన్‌లు కట్టడానికి తంటాలు పడుతుంటే కేంద్ర మాత్రం తన క్యాపిటలిస్టు మిత్రులకు కోట్లాది రూపాయాలను మాఫీ చేస్తున్నదని విమర్శించారు.

బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు రాహుల్ గాంధీ వైఖరికి వైరుధ్యమేమీ లేదని రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ అన్నారు. వారు చట్టబద్ధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని, వారికి తాము ఎలాంటి కన్సెషన్ ఇవ్వడం లేదని తెలిపారు. పేదలు, రైతులు నిస్పృహలో ఉంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు బడా వ్యాపారులకు అనుకూలంగా ఉన్నాయనే రాహుల్ అంటున్నారని వివరించారు.

ఈ సదస్సును బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తున్నదో అర్థం కావడం లేదని, అశోక్ గెహ్లాట్‌ను వ్యతిరేకించుకోండని, కానీ, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం జరిగే పనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటూ సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios