ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కుంటుంబం నుంచి ఒకరు రాజ్యసభకు వెళ్లనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం  సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా అదానీ గ్రూప్ స్పందించింది. అందులో ఎటువంటి వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కుంటుంబం నుంచి ఒకరు రాజ్యసభకు వెళ్లనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైసీపీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీ కుటుంబంలో ఒకరికి రాజ్యసభ సీటు కేటాయించనున్నారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. గౌతమ్ అదానీ గానీ లేదా ఆయన భార్య ప్రీతి అదానీకి గానీ ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్టుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

అయితే వీటిపై అదానీ గ్రూప్ స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తమకు రాజకీయాల్లోకి రావాలని గానీ, రాజకీయ పార్టీలో గానీ చేరాలనే ఆసక్తి లేదని ప్రకటనలో పేర్కొంది. ‘‘రాజ్యసభ సీటు గురించిన తప్పుడు వార్తలపై మీడియా ప్రకటన.. గౌతమ్ అదానీ లేదా డాక్టర్ ప్రీతి అదానీకి రాజ్యసభ సీటు ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి పూర్తిగా తప్పుడు నివేదికలు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా ఇలాంటివి కనిపిస్తాయి. 

ఇలాంటి ఊహాజనిత మీడియా కథనాలల్లోకి కొందరు స్వార్థపరులు మా పేర్లను లాగడం దురదృష్టకరం. గౌతమ్ అదానీ లేదా ప్రీతి అదానీ లేదా అదానీ కుటుంబ సభ్యులెవరికీ కూడా.. రాజకీయ జీవితంపై గానీ, రాజకీయ పార్టీ చేరాలనే ఆసక్తి లేదు’’ అని అదానీ గ్రూప్‌ ప్రకటనలో పేర్కొంది.