గీజర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి.. దంపతులు మృతి, కొడుకుకు అస్వస్థత...
ఓ దంపతులు షీత్లా అష్టమి రోజు రంగులతో ఆడుకున్నారు. ఆ తరువాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లి విగతజీవులుగా మారారు. గీజర్ గ్యాస్ లీకవ్వడంతో ఊపిరాడక చనిపోయినట్లు తేలింది.
జైపూర్ : రాజస్థాన్‌లో విషాద ఘటన వెలుగు చూసింది. గీజర్ నుంచి గ్యాస్ లీకవడంతో ఓ దంపతులు మృతి చెందారు. వారి ఐదేళ్ల బాబు స్పృహతప్పి పడిపోగా, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రాజస్తాన్ లోని భిల్వారా జిల్లాలో జరిగింది. ఈ దంపతులు తమ ఇంట్లో స్నానం చేస్తుండగా గీజర్ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
బాత్రూంలో వారితోపాటు ఉన్న వారి ఐదేళ్ల కుమారుడు స్పృహతప్పి పడిపోయాడని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వారు తెలిపారు. మృతులను శివనారాయణ ఝన్వర్ (37), అతని భార్య కవితా ఝన్వర్ (35) గా గుర్తించారు. కుమారుడు విహాన్. వీరంతా షాపురా నివాసితులు.. వీరు షీత్లా అష్టమి రోజున రంగులతో ఆడుకున్నారని విచారణ అధికారి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఆ తరువాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లారు. కానీ, రెండు గంటలు గడిచిపోతున్నా ముగ్గురూ బాత్‌రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానంతో.. తలుపు తట్టారు. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతోవారు తలుపు పగులగొట్టి చూశారు. అక్కడ బాత్రూం గీజర్ ఆన్‌లో ఉంది. ముగ్గురు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే ముగ్గురిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే దంపతులు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారని అధికారి తెలిపారు. చిన్నారికి చికిత్స అందిస్తున్నారు.
ఉద్యమం మరింత ఉధృతం.. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక: అస్సాం సీఎం
ఇదిలా ఉండగా, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో ఓ విషాదకర ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఇంట్లో మంటలు చెలరేగి తల్లి, ఇద్దరు కూతుర్లు సజీవ దహనం అయ్యారు. ఘటన రోజు మధ్యాహ్నం రాయచూరు తాలూకా శక్తి నగర్ కెపిసిఎల్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వారిని రంజిత (33), మృదుల (13), తారుణ్య(5)గా గుర్తించినట్లు శక్తి నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలిపారు. ఇంట్లోని ఏసీలో మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అనుమానిస్తున్నారు. అయితే, ఇంట్లో మంటలు పూర్తిగా అలుముకోవడానికి స్పష్టమైన కారణాలు తెలియ రాలేదు.
ఈ ఘటన మీద సమాచారం అందడంతో రాయచోటి ఎస్పీ సత్యనారాయణ, శక్తి నగర్ పిఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. శక్తి నగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్న సిద్ధ లింగయ్య కుటుంబం ఈ ప్రమాదానికి గురైంది. సిద్ధ లింగయ్య మండ్య జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రమాదం జరిగిన సమయంలో సిద్ధ లింగయ్య ఇంట్లో లేరు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంటల కారణంగా అలుముకున్న దట్టమైన పొగ చుట్టుపక్కల ఇళ్లకు కూడా వ్యాపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.