జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారిని తోటి ఖైదీలతో చంపించడం మనం చాలా సినిమాల్లో చూశాం. ఇప్పుడు అచ్చం అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగీని భాగ్‌పట్‌లోని జైల్లో హత్య చేశారు.. జైల్లోని ఓ ఖైదీ ఇవాళ తెల్లవారుజామున భజరంగీపై ఓ ఖైదీ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు..

2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసుతో పాటు పలు హత్య కేసులు, దోపిడీ కేసుల్లో భజరంగీ నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇతనిని 2009 అక్టోబర్‌లో ఢిల్లీ ప్రత్యేక పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతను ఝాన్సీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2012లో జైల్లో నుంచే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి మున్నా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కాగా, తన భర్తను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. ఆయనను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేందుకు కుట్ర జరుగుతోందని భజరంగీ భార్య సీమా సింగ్ మీడియాకు చెప్పిన కొద్దిరోజుల్లోనే హత్య జరగడం గమనార్హం. మరోవైపు మున్నా హత్యతోప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. జైల్లోనే రక్షణ లేదని ఆరోపించాయి.

ఈ సంఘటనపై సీరియస్ అయిన సీఎం యోగి ఆదిత్యనాథ్ జైలర్‌ను సస్పెండ్ చేసి.. విచారణకు ఆదేశించారు. మున్నాను ఈ ఆదివారమే ఝాన్సీ జైలు నుంచి భాగ్‌పట్‌ తరలించారు. హత్య వెనుక సునీల్ రాఠీ గ్యాంగ్ ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.