తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ను అధికారులు ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను మంగళవారం ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు.

ఢిల్లీలోని తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ను అధికారులు ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను మంగళవారం ఎయిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు జైలు అధికారి ఒకరు తెలిపారు. ఈ రోజే రాజన్ డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, అతడిని డిశ్చార్జి చేసే విషయంలో ఇంతవరకూ అధికారిక సమాచారం ఏమీ లేదన్నారు. 61 ఏళ్ల ఛోటా రాజన్‌కు ఏప్రిల్‌లో కరోనా సోకడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. దీంతో అతడు కరోనాతో మృతిచెందినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలన్నీ అవాస్తవమని జైలు అధికారులు ప్రకటించారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఛోటా రాజన్‌ను తిహార్ జైలుకు తరలించారు. 

చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ్. తొలుత దావూద్ ఇబ్రహీం అనుచరుడుగా ఉన్నాడు. దావూద్ తో విబేధాల కారణంగా చోటా రాజన్ మరో గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ప్రత్యర్ధిగా మారాడు. ముంబై పోలీసులు, భారత నిఘా ఏజెన్సీలు అతని కోసం దాదాపు రెండు దశాబ్దాలు పాటు అన్వేషణ సాగించాయి. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న ఛోటారాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో 2015లో ఇండోనేషియా అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు భారత అధికారులు.