చేపలు పడలేదన్న కోపంతో కొందరు యువకులు ఓ డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. డిసెంబరు 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ప్రతాప్‌గఢ్ జిల్లాలో కొందరు యువకులు ఓ డాల్ఫిన్‌ను కర్రలు, గొడ్డలి, రాడ్లతో కొట్టి దారుణంగా హింసించి చంపారు. జిల్లాలోని కొఠారియా గ్రామ సమీపంలోని శారద కెనాల్‌లో చేపల వేటకు వెళ్లిన యువకులకు 5 అడుగుల పొడవున్న డాల్ఫిన్ చిక్కింది. మొదట దాన్ని పెద్ద చేప అనుకున్నారు. బయటకు వచ్చి చూసి చేపకాదని నిరుత్సాహ పడ్డారు. 

అది డాల్ఫిన్ అని తెలియడంతో కోపంతో దాడి చేశారు. వారికి మరికొందరు జత కలిశారు. అందరూ కలిసి గొడ్డలి, కర్రలతో దాడిచేశారు. వారి పైశాచికత్వాన్ని చూసిన ఓ వ్యక్తి ‘‘దానిని అకారణంగా ఎందుకలా కొట్టి హింసిస్తున్నారు?’’ అని అరవడం వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. అయినప్పటికీ పట్టించుకోని వారు కత్తులతో దాని శరీరాన్ని రెండుగా చీల్చారు. 

ఆ తర్వాత దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీసిన ఓ యువకుడు దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఆ వీడియో కాస్తా అటూఇటూ తిరిగి పోలీసులకు చేరడంతో అప్రమత్తమయ్యారు. 

సమీప గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 5 అక్టోబరు 2009లో డాల్ఫిన్‌ను ప్రభుత్వం జాతీయ జల జంతువుగా ప్రకటించింది. డాల్ఫిన్ చంపడం వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 సెక్షన్ 9/51 ప్రకారం శిక్షార్హమైన నేరం.