రాజస్థాన్ లో దారుణం జరిగింది. ఓ మహిళను తన భర్త, ఇద్దరు పిల్లల ముందే సామూహిత అత్యాచారం చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన ధోల్‌పూర్ జిల్లాలో ఓ దళిత మహిళపై జరిగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
లైంగిక వేధింపులు, దాడుల నుంచి మహిళలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నా వారికి రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా.. తరచూ మహిళలపై, చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పసిపాపలు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళ కనిపిస్తే చాలు కామవాంఛతో కాటేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ (Rajasthan) లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భర్త, పిల్లల ముందే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్‌పూర్ (Dholpur) జిల్లాలో ఈ అనాగరిక ఘటన చోటు చేసుకుంది. ఓ 26 ఏళ్ల మహిళపై తన భర్త, పిల్లల ముందే సామూహిక అత్యాచారం చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ నేరానికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ దళిత మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పొలం నుంచి ఇంటికి తిరిగి వస్తోంది. అయితే ఈ క్రమంలో ఆరుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. తుపాకీతో బెదిరించారు. మహిళ భర్తపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం ఆరుగురి నిందితుల్లో ఇద్దరు ఆ మహిళపై పిల్లలు, భర్త ముందే అత్యాచారం చేశారు. తరువాత ఆ నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై అత్యాచారం, భౌతిక దాడి, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ సింగ్ (Vijay Kumar Singh) తెలిపారు.
ఈ ఘటనపై రాజస్థాన్ బీజేపీ చీఫ్ డాక్టర్ సతీష్ పూనియా (Satish Poonia) స్పందించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ ఈ సంఘటన కారణంగా రాజస్థాన్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అశోక్ గెహ్లాట్ హయాంలో నేరస్థుల తాలిబానీ పాలన కనిపిస్తోంది ’’ అంటూ సతీష్ పూనియా ట్వీట్ చేశారు.
యూపీలో ఈ నెల మొదటి వారంలో కూడా ఇలాంటి సామూహిక అత్యాచార ఘటన చోటు చేసుకుంది. యూపీ (up) రాష్ట్రం మీరట్ లోని సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే మహిళ ప్రతీ రోజూ ఖటోలీలో ఉండే కాలేజీకి వెళ్లి చదువుకుంటుంది. రోజులాగే కాలేజీకి వెళ్లిన యువతిని ఓ ఐదుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాలని భావించారు. ఢిల్లీకి వెళ్తున్న క్రమంలోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బెదిరించారు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని హెచ్చరించారు. అనంతరం బాధిత యువతిని వారు మీరట్ కు తీసుకొచ్చి వదిలిపెట్టారు. కాగా కాలేజీకి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. బాధితురాలు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగిన ఘటన గురించి తెలియజేసింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
