లక్నో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు కొందరు మగాళ్లు మృగాళ్లా మారుతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే చాలామంది మహిళలు, చిన్నారులు కామాంధుల చేతుల్లో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక కూడా సామూహిక అత్యాచారానికి గురవుడే కాదు ప్రాణాలు కూడా కోల్పోయింది. 

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లా సర్దానా ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికపై కొందరు యువకుల కళ్ళు పడ్డాయి. ఎలాగయినా బాలికను అనుభవించాలని బావిస్తున్న వారు అదను కోసం ఎదురుచూశారు. అయితే బాలిక సాయంత్రం ట్యూషన్ నుండి ఒంటరిగా తిరిగా రావడాన్ని గమనించిన వారు ఇదే అదునుగా భావించారు. నలుగురు యువకులు కలిసి బాలికను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. 

బాలికపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడుతూ అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. ఇలా సామూహిక అత్యాచారానికి పాల్పడిన అనంతరం కూడా బాలికను వదిలిపెట్టకుండా విషమిచ్చారు. అయితే ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన యువకులను వదిలిపెట్టకూడదని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.