సారాంశం
మహాత్మ గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
మహాత్మ గాంధీ 154వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు సోమవారం ఉదయం రాజ్‌ఘాట్‌ను సందర్శించి.. మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలు కూడా రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా మహాత్మునికి నివాళులర్పిస్తూ పోస్టు చేశారు.
గాంధీ ప్రభావం గ్లోబల్,ఐక్యత, కరుణ స్ఫూర్తిని మరింత పెంచడానికి మొత్తం మానవాళిని ప్రేరేపిస్తుందని మోదీ పేర్కొన్నారు. ‘‘గాంధీ జయంతి ప్రత్యేక సందర్భంలో నేను మహాత్మా గాంధీకి నమస్కరిస్తున్నాను. ఆయన నిత్య బోధనలు మన మార్గాన్ని ప్రకాశింపజేస్తూనే ఉన్నాయి. ఆయన కలలను నెరవేర్చేందుకు మనం ఎల్లప్పుడూ కృషి చేద్దాం. ఆయన ఆలోచనలు ప్రతి యువకుడికి ఆయన కలలుగన్న మార్పుకు కారకునిగా ఉండనివ్వండి. ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించండి’’ అని మోదీ ఎక్స్(ట్విట్టర్) వేదికగా మహాత్మునికి నివాళులర్పించారు. మరోవైపు నేడు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా కావడంతో విజయ్ ఘాట్‌లో ప్రధాని మోదీ నివాళులర్పించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా రాజ్‌ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ కేవలం వ్యక్తి మాత్రమే కాదని.. మన గొప్ప దేశానికి ఒక ఆలోచన, సిద్ధాంతం, నైతిక దిక్సూచి అని అన్నారు. ‘‘సత్యం, అహింస, స్వేచ్ఛ, సమానత్వం, సహజీవనంకు సంబంధించి గాంధీ ఆదర్శాలకు శాశ్వతమైన విలువ ఉంది. బాపు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు గౌరవప్రదంగా నమస్కరిస్తున్నాం’’ అని మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.