Galwan Violence: గాల్వాన్ హింసాకాండలో మరణించిన చైనా సైనికుల వివరాలను పంచుకోవడానికి భారత సైన్యం నిరాకరించింది. ఇది ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) ప్రకారం పంచుకోలేని థర్డ్ పార్టీ సమాచారమ‌ని RTI పిటిష‌న్ ను తిరస్క‌రించింది. 

Galwan Violence: రెండేళ్ల క్రితం.. ల‌ద్దాఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా, భారత భద్రతా బలగాల మ‌ధ్య హింసాకాండ జ‌రిగింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో చైనా సైనికులు ఎంత‌మంది మృతి చెందారు లేదా ఎంత‌మంది గాయ‌ప‌డ్డార‌నే విష‌యంపై వివ‌రాలు తెల‌పాల‌ని స‌మాచార హ‌క్కు చ‌ట్టం (RTI) ద్వారా ఓ వ్య‌క్తి కోరారు.

అలాగే.. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో ఎంత‌మంది భార‌త సైనికులు మృతి చెందారు? ఎంత‌మంది గాయ‌ప‌డ్డార‌నే వివ‌రాలు కూడా చెప్పాల‌ని RTI ద్వారా అడిగారు. కానీ, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC) మాత్రం.. ఆ స‌మాచారాన్ని వెల్లడించలేమని స్పష్టంగా పేర్కొంది. స‌ద‌రు వ్య‌క్తి పిటిషన్‌ను అనుమతించడానికి నిరాకరించింది. 

2020, జూన్ 15 రాత్రి గల్వాన్ లోయ‌లో భారత్-చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన విష‌యం తెలిసిందే. భార‌త స‌రిహ‌ద్దులోని గల్వాన్ లోయలోకి చైనా సైనికులు అక్ర‌మంగా చొర‌బడ్డారు. వారి చ‌ర్య‌ల‌ను భారత సైనికులు తీవ్రంగా ప్రతిఘటించారు.

RTI దరఖాస్తుదారు అఖండ.. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) సమీపంలోని గాల్వాన్ లోయలో భారత భద్రతా దళాలు జరిపిన ప్రాణనష్టం గురించి, ఈ ఘ‌ర్ష‌ణ‌లో మరణించిన సైనికుల కుటుంబాలకు పునరావాసం, పరిహారం చెల్లింపు గురించి సమాచారం అడిగారు. 2020 జూన్ 15, 16 మధ్య రాత్రి జరిగిన హింసాత్మక ఘర్షణల సమయంలో మరణించిన వ్యక్తులకు సంబంధించి వివ‌రాలు కావాల‌ని త‌న‌ పిటిషన్ లో పేర్కొన్నారు. ఇది కాకుండా.. హింసాత్మక ఘర్షణ తర్వాత గాల్వాన్ లోయలో ఎవరైనా భారతీయ సైనికుడు తప్పిపోయారా? అని ఆర్టీఐ దరఖాస్తుదారు భారత సైన్యాన్ని కోరాడు. 

అయితే.. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జె) కింద షేర్ చేయలేని థర్డ్ పార్టీ సమాచారం అని పేర్కొంటూ భారత సైన్యం ఆ సమాచారాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించింది. అటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడాన్ని తప్పనిసరి కాదు. RTI చట్టంలోని సెక్షన్ 8(1)(a) ప్ర‌కారం.. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, అంత‌ర్గ‌త‌ భద్రత, వ్యూహాత్మక, శాస్త్రీయ లేదా ఆర్థిక ప్రయోజనాలను ప్ర‌భావితం చేసేలా ఉండే స‌మాచారాన్ని ఇవ్వ‌లేమ‌ని తెలిపింది. ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉన్న సమాచారాన్ని బహిర్గతం చేయడం సాధ్యం కాద‌నీ భార‌త ఆర్మీ పేర్కొంది. ప్ర‌జాప్ర‌యోజ‌నాల దృష్ట్యానూ ఆయా వివ‌రాలు ఇవ్వ‌లేమ‌ని పేర్కొంది.

ఈ విష‌యంపై సమాచార కమీషనర్ వనజ ఎన్ సర్నా మాట్లాడుతూ.. “అప్పీలెంట్‌కు తగిన దశలో సమాధానం ఇవ్వబడిందని, ఇందులో సమాచారం థ‌ర్డ్ పార్టీకి సంబంధించినది కాబట్టి, సెక్షన్ 8(సెక్షన్) కింద సమాచారం అందించలేమని స్ప‌ష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. ఈ హింసాకాండ‌లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని భార‌త సైన్యం ప్ర‌క‌టించింది. అలాగే, చైనా వైపు కూడా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని ఆర్మీ తెలిపింది. అనంత‌రం భార‌త్-చైనా మధ్య‌ చర్చలు జరిగి ప‌రిస్థితులు అదుపులోకి వ‌చ్చాయి.