తెలంగాణ ముద్దుబిడ్డ అమరుడు కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీర చక్ర అవార్డు ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లద్దాఖ్‌ సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో సూర్యాపేటకు చెందిన కల్నల్‌ సంతోష్‌బాబు అసువులు బాసిన సంగతి తెలిసిందే. 

ఆయన త్యాగానికి గానూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరమ వీర చక్ర అవార్డును ప్రకటిస్తారని భావిస్తున్నారు. యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం అయిన పరమవీర చక్ర అవార్డును ఇప్పటివరకు 20మందికి మాత్రమే ఇచ్చారు.

గల్వాన్‌ పోరాటంలో సంతోష్‌తోపాటు ప్రాణాలు అర్పించిన మొత్తం 20మంది సైనికులకు, గాయపడిన మరికొంత మంది సైనికులకు అవార్డులు ప్రకటించే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో ఇచ్చే అవార్డులనే వీరికి ఇవ్వాలని సైన్యం ఉన్నతాధికారులు సిఫారసు చేసినట్లు సమాచారం. 

యుద్ధ సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో పరమవీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర, వీర్‌ చక్ర ఉన్నాయి. శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాల్లో అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర ఉన్నాయి. గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఈ అవార్డులను ప్రకటిస్తారు.

గత ఏడాది జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను భారత్‌ అడ్డుకొనే క్రమంలో జరిగిన భీకర పోరులో కల్నల్‌ సంతోష్‌బాబుసహా 20 మంది మరణించగా, చైనా వైపు నుంచి.. 35 మంది చైనా సైనికుల బాడీలను స్ట్రెచర్‌ల మీద తీసుకెళ్లారు.