G20 summit 2023: రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన మోదీ, బైడెన్, రిషి సునాక్, ఇతర జీ20 నేతలు..
భారతదేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. జీ20 సదస్సు రెండో రోజున రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు.

భారతదేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. జీ20 సదస్సు రెండో రోజున రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి ప్రపంచ నేతలు నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, జపాన్ పీఎం ఫుమియో కిషిడా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌లతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం వారంతా రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు.
జీ20 సదస్సు మొదటి రోజు.. ప్రపంచ నాయకులు 'ఢిల్లీ డిక్లరేషన్'ను ఆమోదించారు. ‘నాకు శుభవార్త అందింది. మా బృందం కృషి కారణంగా.. న్యూఢిల్లీ జీ20 లీడర్స్ సమ్మిట్ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ నాయకత్వ ప్రకటనను ఆమోదించాలనేది నా ప్రతిపాదన. ఈ డిక్లరేషన్‌ను ఆమోదించినట్టుగా నేను ప్రకటిస్తున్నాను. ఈ సందర్భంగా నేను షెర్పా, మంత్రులు, దాని కోసం కష్టపడి పని చేసి, దానిని సాధ్యం చేసినవారికి అభినందనలు’’ అని ప్రపంచ నాయకుల నుంచి కరతాళధ్వనులు మధ్య మోదీ పేర్కొన్నారు. జీ20 చరిత్రలో భారతదేశం జీ20 ప్రెసిడెన్సీ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని మోదీ అన్నారు.
ఇక, ఆఫ్రికన్ యూనియన్ శనివారం జీ20లో శాశ్వత సభ్యత్వం పొందింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ ప్రతిపాదనను అన్ని సభ్య దేశాలు స్వాగతించాయి. ఆ తర్వాత ప్రధాని మోదీ.. యూనియన్ ఆఫ్ కొమొరోస్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) ఛైర్‌పర్సన్ అజాలి అసోమానిని జీ 20 హై టేబుల్‌లో కూర్చోవాలని ఆహ్వానించారు.
ఇదిలాఉంటే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన గత రాత్రి ఇచ్చిన జీ20 విందుకు ప్రపంచ నేతలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.