Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై జీ 23 సభ్యుడి కౌంటర్.. మనీష్ తివారీ సూటి ప్రశ్నలు.. గొంతు కలిపిన కార్తీ చిదంబరం

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై గ్రూప్ ఆఫ్ 23 సభ్యుడు మనీష్ తివారీ ఘాటుగా స్పందించారు. పార్టీకి సూటిగా ప్రశ్నలు వేశారు. అధ్యక్ష ఎన్నికలో ఓటేసే వారి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్టర్ల పేర్లను బహిరంగం చేయకుండా దీన్ని పారదర్శక, స్వేచ్ఛా ఎన్నిక అని ఎలా చెప్పగలం అని ప్రశ్నించారు.

G 23 member manish tewari questions transparency in congress president election
Author
First Published Aug 31, 2022, 4:06 PM IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఎన్నికలకు పార్టీ అత్యున్నత బాడీ సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసింది. సెప్టెంబర్ 22న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుండగా.. 19వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై దేశమంతటా జరుగుతున్నది. కొన్ని సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్‌లో ఉండగా.. తాజాగా ఎన్నిక షెడ్యూల్ రావడంతో సామాన్య ప్రజలు సహా కాంగ్రెస్ శ్రేణులూ మాట్లాడుకుంటున్నాయి. 

మొదటి నుంచీ కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన గావించాలని డిమాండ్ చేస్తున్న జీ 23 సభ్యులు కూడా ఈ ప్రకటనపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంలో మనీష్ తివారీ పార్టీకి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకతపై కొత్త చర్చను లేవదీసింది.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై పారదర్శకతను డిమాండ్ చేస్తూ మనీష్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునే ఎలక్టర్ల పేర్లు ఎందుకు గుప్తంగా ఉంచుతున్నారని నిలదీశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో ఓటేసే ఎలక్టర్ల పేర్లను పారదర్శకత కోసం కచ్చితంగా బహిరంగపరచాల్సిందేనని డిమాండ్ చేశారు. వారి పేర్లను ఏఐసీసీ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయాలని సూచించారు.

అధ్యక్ష ఎన్నిక బరిలో దిగే అభ్యర్థి ఎన్నుకునే ఓటర్ల జాబితా కోసం పీసీసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అగత్యం ఏమున్నదని ప్రశ్నించారు. ఇలా కనీసం క్లబ్ ఎలక్షన్‌లలోనూ జరగదని అన్నారు. 

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీని ఈ సందర్భంగా మనీష్ తివారీ ప్రస్తావించారు. ఓటర్ల జాబితా బహిరంగంగా అందుబాటులో ఉంచని ఈ ఎన్నికను ఎలా పారదర్శకమైనా.. స్వేచ్ఛ ఎన్నిక అనగలం? అని ప్రశ్నించారు. పారదర్శకమైన ఎన్నిక ఎలక్టరోల్ రోల్స్ పబ్లిష్ చేయడం కీలకమైన అంశం అని వివరించారు. వాటిని పారదర్శకంగా కాంగ్రెస్ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయాలని డిమాండ్ చేశారు. 

‘‘ఈ జాబితాను బహిర్గతం చేయలేదని, కానీ, పార్టీ సభ్యులు ఎవరైనా చెక్ చేయాలనుకుంటే పీసీసీ ఆఫీసుకు వెళ్లి ఆ పని చేసుకోవచ్చు. అలాగే, అధ్యక్షుడి కోసం నామినేషన్ వేసిన అభ్యర్థులకూ ఈ జాబితాను అందజేస్తాం’ అని మిస్త్రీ చెప్పారు’ అని మనీష్ తివారీ గుర్తు చేశారు.

ఎంపీ మనీష్ తివారీతోపాటు మరో ఎంపీ కార్తీ చిదంబరం గొంతు కలిపారు. మనీష్ తివారీ వాదనలను సమర్థించారు. ఎన్నిక అంటే స్పష్టమైన ఎలక్టోరల్ కాలేజ్ ఉండాలని అన్నారు. తాత్కాలిక ఎలక్టోరల్ కాలేజ్ అసలు.. ఎలక్టోరల్ కాలేజే కాదని పేర్కొన్నారు. అంతేకాదు, సంస్కరణవాదులు తిరుగుబాటుదారులు కాదని స్పష్టం చేశారు.

ట్విట్టర్‌లో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పార్టీని సంస్కరించాలనుకున్న నేత కచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనా? కేవలం గుడ్డిగా నమ్మేవారిని మాత్రమే పార్టీలో కొనసాగడానికి అనుమతిస్తారా? అని ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios