Raipur: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో నేషనల్ హార్టికల్చర్ మిషన్ స్కీమ్‌లో రూ.20 లక్షల నిధులను దుర్వినియోగం చేసినందుకు బీజేపీ నేత సహా 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు 

Chhattisgarh horticulture scheme: ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో నేషనల్ హార్టికల్చర్ మిషన్ స్కీమ్‌లో 20 లక్షల రూపాయల నిధులను దుర్వినియోగం చేసినందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయకుడితో సహా 9 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఛత్తీస్‌గఢ్‌లోని బైకుంత్‌పూర్‌లోని అజాక్ పోలీస్ స్టేషన్‌లో బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు అంచల్ రాజ్‌వాడ సహా తొమ్మిది మందిపై కేసు నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆనందీ సింగ్ అనే 80 ఏళ్ల రైతు తన భూమిలో కమ్యూనిటీ చెరువు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే, తనకు వచ్చిన మొత్తంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నవంబర్ 23, 2022న కలెక్టర్ (కొరియా జిల్లా) కు ఫిర్యాదు చేశాడు.

దరఖాస్తుదారుని రాత‌పూర్వక ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, జిల్లా పంచాయతీ కొరియా ముఖ్య కార్యనిర్వహణాధికారిని వెంటనే విచారణకు ఆదేశించి, ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి పరిగణలోకి తీసుకున్నట్లు త్రిలోక్ బన్సల్ (ఎస్పీ) కొరియా తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

ఫిర్యాదు లేఖపై దర్యాప్తునకు ప్ర‌త్యేక‌ బృందం

జిల్లా పంచాయతీ సీఈవో నమ్రత జైన్‌ ఆదేశాల మేరకు ఫిర్యాదు లేఖపై విచారణకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ద‌ర్యాప్తు తర్వాత, కేసుకు సంబంధించిన విచారణ నివేదిక అవసరమైన చర్య కోసం డిప్యూటీ డైరెక్టర్ పంచాయితీ జిల్లా కొరియాకు అందింది. 

ఎస్పీ ఏం చెప్పారంటే..? 

నేషనల్ హార్టికల్చర్ మిషన్‌లో ఫిర్యాదు అందిందని ఎస్పీ త్రిలోక్ బన్సల్ తెలిపారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణ అనంతరం పోలీసులకు నివేదిక అందింది. ఇందులో న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నారు. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ప్రాథమిక నేరం కనుగొనబడినప్పుడు, నేరం IPC సెక్షన్లు 419, 420, 467, 468, 471, 472, 474, 409, 120 (B), IT చట్టం, ST/SC చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నమోదు చేయబడిందన్నారు.