పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (cooking gas) ధరల పెరుగుదలపై విపక్ష పార్టీలు (Opposition parties) మంగళవారం లోక్‌సభలో (Lok Sabha) నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ధరల పెరుగుదలకు నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ (cooking gas) ధరల పెరుగుదలపై విపక్ష పార్టీలు (Opposition parties) మంగళవారం లోక్‌సభలో (Lok Sabha) నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ధరల పెరుగుదలకు నిరసిస్తూ విపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇంధన ధరలపెంపునకు వ్యతిరేకంగా తృణమూల్, ఎన్సీపీ, డీఎంకే, వామపక్ష పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
ఇక, లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే.. ప్రతిపక్షాలు ధరల పెంపు అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు. అయితే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అందుకు అనుమతించలేదు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఈ అంశాన్ని లేవనెత్తాలని స్పీకర్ విపక్షాలకు సూచించారు.
ఇక, లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజాన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) ఇంధన ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సిలిండర్ ధరలను అకస్మాత్తుగా పెంచారని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు పెరగడం, ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరగడంపై ఆయన మాట్లాడారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీ ధరల పెరుగుదల గురించి తాము అన్ని రకాల భయాందోళనలను వ్యక్తం చేశామని.. ఎన్నికలు ముగియడంతో ఈరోజు అవి నిజమయ్యాయని చెప్పారు.
ఇంధనం, డీజిల్, గృహోపకరణాల విషయానికొస్తే ధరలు భారీగా పెరిగాయని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ఈ క్రమంలోనే ధరల పెంపుకు నిరసనగా టీఎంసీతో పాటు కాంగ్రెస్, డీఎంకే సహా ఇతర ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇక, పార్లమెంట్ వెలుపల అధిర్ రంజాన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయని మేము చెప్పాము. ఇప్పుడే అది నిజమని నిరూపితమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదలను దోచుకోవడానికి ఏమాత్రం వెనుకాడదు. సభ వెలుపల, లోపల సాధారణ ప్రజల కోసం మేము.. ధరల పెంపుకు వ్యతిరేకంగా నిలబడతాం’ అని తెలిపారు.
