దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కలకు పంక్చర్..
కారులో(కేసీఆర్ పార్టీ గుర్తు) రాజధానికి వెళ్లాలనే తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశలపై కర్ణాటక ఎన్నికల ఫలితాలు నీళ్లు చల్లాయి. బీఆర్ఎస్‌తో జాతీయ స్థాయిలో రాణించాలని భావించిన కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌లకు తనను ప్రత్యామ్నాయంగా ప్రొజెక్టు చేసుకునేందుకు ప్రయత్నించారు. జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి అనేక సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ వారి స్థావరాన్ని తిరిగి చేజిక్కించుకోవడంతో కేసీఆర్ ఆశయం దెబ్బతింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార వేడుక కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అనేక మంది బీజేపీయేతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ వేడుకను విపక్షాల బలపరీక్షగా కాంగ్రెస్ మార్చుకుంది. ఇదంతా కర్ణాటక విజయం తర్వాత కాంగ్రెస్ పుంజుకుంటుందనే ప్రాధాన్యతను పరోక్షంగా సమర్థిస్తుంది.
అయితే కర్ణాటక ఎన్నికల ముందు కేసీఆర్.. అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే జేడీఎస్ అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి కింగ్ మేకర్‌గా మారతారనే రాజకీయ సూత్రంతో ఆయనతో సత్సబంధాలను కొనసాగించారు. అయితే కేసీఆర్ లెక్కలు తప్పాయి. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీతో పాటు మరో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఘన విజయం సాధించడం ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్‌కు సహజంగానే రుచించదనే చెప్పాలి. అందుకే కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి ఆహ్వానితుల జాబితాలో కేసీఆర్ లేకపోవటంలో ఆశ్చర్యం లేదు.
చివరికి మారిన ఫలితం.. అదొక్కటే ఊరట..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ.. బెంగళూరులోని జయనగర నియోజకవర్గంలో హై డ్రామా నడిచింది. జయనగర మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఫలితాలు సాయంత్రంలోపే వెలువడ్డాయి. అయితే ఇక్కడ చివరకు ఫలితం తారుమారు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి 150 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం ప్రారంభించినప్పటికీ.. బీజేపీ రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసింది.
బెంగళూరు సౌత్ (జయనగర అసెంబ్లీ నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉంది) ఎంపీ తేజస్వి సూర్య కౌంటింగ్ బూత్‌లోకి ప్రవేశించి రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే కౌంటింగ్ స్టేషన్‌లో బీజేపీ నాయకులెవ్వరూ ఉండరాదనే షరతుతో ఎన్నికల సంఘం అధికారులు వెంటనే వారి డిమాండ్‌కు అంగీకరించారు. దీంతో పలుమార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అయితే అర్దరాత్రి వరకు కొనసాగిన హైడ్రామాలో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి 16 ఓట్ల తేడాతో విజయం సాధించినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు.
దీంతో సౌమ్యరెడ్డి కన్నీరు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే పక్కనే ఉన్న బీటీఎం లేఅవుట్ నియోజకవర్గం నుంచి సౌమ్య తండ్రి రామలింగారెడ్డి విజయం సాధించడమే సౌమ్య కుటుంబానికి కొంత ఓదార్పునిచ్చింది. ఇక, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో గెలిచిన మరికొందరు అభ్యర్థులు కూడా ఉన్నారు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి సప్తగిరిగౌడ్‌పై మాజీ సీఎం దివంగత గుండూరావు తనయుడు దినేష్ గుండూరావు 105 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిక్కమగళూరులోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన జీవరాజ్‌పై 201 ఓట్ల తేడాతో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజుగౌడ్ విజయం సాధించారు.
సింహ గర్జన కోల్పోయిన నేత..
‘కర్ణాటక సింగం’ (కర్ణాటక సింహం) తన గర్జనను కోల్పోయింది. పొరుగున ఉన్న తమిళనాడులో బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నప్పటికీ.. కర్ణాటక ఎన్నికల సమయంలో ఈ నాయకుడికి గణనీయమైన బాధ్యత అప్పగించబడింది. అయితే ఆయన సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం, టిక్కెట్ల పంపిణీలో జోక్యం చేసుకోవడం ఇప్పుడు బీజేపీ ఎన్నికల్లో ఓటమికి ఒక కారణమని చెబుతున్నారు. నిజానికి చాలా మంది సీనియర్ నేతలు ఆయనతో వేదికలు పంచుకోవడానికి నిరాకరించారు. దీంతో ఆ నాయకుడు భారీగా వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నారు. ఈ గర్జించే సింహం తన రాజకీయ వైభవాన్ని తిరిగి పొందే వరకు విధేయత గల పిల్లిలా మారినట్టే చెప్పాలి.
కుస్తీ.. దోస్తీ..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా.. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గైర్హాజరు కావడం విశేషం. విజయన్ తనను తాను ప్రతిపక్ష ఐక్యతకు చిహ్నంగా అభివర్ణిస్తున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయనను ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఈ వేడుకకు పలువురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వామపక్ష నేతలు సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి రాజాలు కూడా ఈ వేడుకలో మెరిసారు.
హాస్యాస్పదంగా.. విపక్షాల ఐక్యతను ధృవీకరించడానికి వామపక్ష జాతీయ నాయకులు కాంగ్రెస్ నాయకులతో చేతులు పట్టుకున్నప్పుడు.. కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నిరసన ప్రదర్శన చేస్తోంది. ఈ రెండు విజువల్స్ దాదాపు ఒకేసారి టీవీలో మెరుస్తూ.. వెంకయ్య నాయుడు వన్-లైనర్ కేరళ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీని గుర్తుచేస్తున్నాయి.