దేశంలో రెండవదఫా విధించిన లాక్ డౌన్ కూడా మే3వతేదీతో ముగుస్తున్నందున నిన్న కేంద్రం లాక్ డౌన్ సడలింపులు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిపైన ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా ఆ 18 పేజీల డాక్యుమెంట్ లోని ముఖ్యాంశాలు మీకోసం... 

రెడ్‌ జోన్‌లలో సడలింపులు 

 • కార్లు(ప్రైవేట్ కార్లు మాత్రమే, ట్యాక్సీలకు అనుమతి లేదు) కేవలం ఇద్దరు వ్యక్తులతో ప్రయాణించొచ్చు( డ్రైవర్ తో కలిపి), బైక్‌ పై ఒక్కరే ప్రయాణించాలి 
 • పరిశ్రమల్లో అత్యవసర సరుకులను ఉత్పత్తి చేసేవి, మెడికల్‌ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం, రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ జూట్‌ మిల్లుల నిర్వహణ వంటి వాటికి అనుమతి ఉంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి 
 •  పట్టణాల్లో భవన నిర్మాణ పనులు కొనసాగుతాయి, కానీ అక్కడ పనిచేసేందుకు వచ్చే కూలీలను బయట ప్రాంతాలనుంచి తరలించడానికి వీలు లేదు. అక్కడి వారితో మాత్రమే నిర్మాణాన్ని చేపట్టాలి.  
 • మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని మాల్స్‌ కు అనుమతి లేదు. కానీ అత్యవసర సరుకులకు మాత్రం అనుమతినిచ్చారు. భౌతిక దూరం తప్పనిసరి.  
 • షాపింగ్ మాల్స్ లో కాకుండా, సింగల్ గా ఉండే షాపులకు అనుమతులిచ్చారు. కాలనీల్లోని షాపులకు, గృహ సముదాయాల్లో ఉండే షాపులకు( అపార్టుమెంట్లలో ఉండే దుకాణాలు, హోసింగ్ సొసైటీస్ లో ఉండే షాపులు) నడుపుకోవచ్చు., కానీ భౌతిక దూరం తప్పనిసరి 
 • ఈ కామర్స్‌ సంస్థలకు(అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలకు) కేవలం అత్యవసర వస్తువులను డెలివరీ చేసేందుకు మాత్రమే అనుమతి. 
 • 33శాతం మంది సిబ్బందితో ప్రైవేటు ఆఫీసులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. 
 • డిప్యూటీ సెక్రటరీ ఆపైస్థాయి‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో పని చేయవచ్చు. మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కేవలం 33 శాతం సిబ్బందితో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది.  

ఆరెంజ్‌ జోన్‌ లో సడలింపులు...  

రెడ్ జోన్లలో ఇచ్చిన అన్ని సడలింపులతోపాటుగా.... ఒక డ్రైవర్, ఒక ప్రయాణికుడితో క్యాబులను అనుమతిస్తారు, ప్రైవేట్ కార్లయితే... డ్రైవర్ తోకలిపి ముగ్గురు ప్రయాణించేందుకు అనుమతిస్తారు. ద్విచక్ర వాహనంపై కూడా ఇద్దరికి అనుమతిస్తారు. 

మద్యం షాపులను కూడా అనుమతిస్తారు, కానీ... షాప్ వద్ద ఒకేసారి అయిదుగురి కన్నా ఎక్కువ ఉండకూడదు. దానితోపాటుగా రెండు గజాల భౌతిక దూరం తప్పనిసరి. 

 గ్రీన్‌ జోన్‌లలో.. 

పైన ఇచ్చిన అన్ని అనుమతులతోపాటుగా...50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులునడపవచ్చు 

జోన్లకు అతీతంగా నిషేధింపబడినవి... 

 • దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు పూర్తిగా రద్దు. వైద్య, రక్షణ రంగాలకు ఇంతకుముందున్నట్టే మినహాయింపులు కొనసాగుతాయి.  
 • సాధారణ ప్రయాణీకులకు రైళ్లలో అనుమతి నిషిద్ధం. కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉన్నవారు మాత్రమే(అత్యవసర సిబ్బంది,  వలస కూలీలు, చిక్కుబడిపోయిన విద్యార్థులు మొదలగువారు) మెట్రో రైళ్లు పూర్తిగా నిషిద్ధం. 
 • కేంద్రం అనుమతించిన బస్సులు మినహా ఇతర ఏ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదు,  అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణాలు  నిషేధం (మెడికల్‌ లేదా కేంద్రం అనుమతించిన వారికి మాత్రమే అనుమతి)
 • అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సంబంధిత సంస్థలన్నీ మూసివేత 
 • అన్ని సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్, బార్లు, కాన్ఫరెన్స్ హాల్స్ మూసివేత 
 • సామాజిక, రాజకీయ, క్రీడా, మత సంబంధ కార్యక్రమాలు పూర్తిగా నిషేధం,ఒక రకంగా  ప్రజలు గుమికూడి ఆస్కారమున్న అన్ని కార్యక్రమాలు పూర్తిగా రద్దు.