ఇద్దరు ప్రాణ స్నేహితులు... సరదాగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. కానీ తిరిగి ఇంటికి చేరలేదు. తీరా వారి కోసం వెతకగా.... ఇద్దరూ ఒకే చెట్టుకి ఉరివేసుకొని కనిపించారు. కాగా... కుటుంబసభ్యులు మాత్రం తమ కుమారులను ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  అణ్ణిహళ్లి గ్రామానికి చెందిన ప్రవీణ్‌  కుమార్‌ (19), కప్పల మడుగు గ్రామానికి చెందిన వీ శ్రీనాథ్‌(24)లు స్నేహితులు. వీరిద్దరూ బుధవారం తమ తమ గ్రామాలనుంచి బైక్‌ల్లో బయటకు వచ్చారు. తిరిగి ఇళ్లకు చేరలేదు. కుటుంబ సభ్యులు గాలించగా గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న  స్థితిలో విగతజీవులుగా కనిపించారు.

మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నంగలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా యువకులను హత్య చేసి చెట్టుకు ఉరివేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కార్తీక్‌రెడ్డి పరిశీలించారు. నిపుణులు వేలిముద్రలు సేకరించారు. జాగీలం సహాయంతో  పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.  వీరిద్దరిదీ ఆత్మహత్య? లేక ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.