పీకలదాకా తాగి ఒళ్లు తెలియని మైకంలో నోటికొచ్చినట్లు వాగిన ఓ తాగుబోతు ఆ మాటల్లో ఒక విషాదాన్ని చెప్పేశాడు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం నాయండహళ్లి వినాయక లేఔట్‌కు చెందిన నాగరాజ్‌కు పక్కింట్లో దిగిన అభిషేక్ కుటుంబంతో మంచి స్నేహం కుదిరింది. నాగరాజు కుమారుడు దినేశ్‌తో అభిషేక్‌ స్నేహం చేసేవాడు.

వీరిద్దరూ ప్రతిరోజు మద్యం తాగటం, గొడవలు పడటం చేసేవారు. ఈ క్రమంలో 2016 మార్చి 16న దినేశ్ రైలు కిందపడి మరణించాడు. దీనిని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా రైల్వే పోలీసులు, దినేశ్ కుటుంబసభ్యులు నమ్మారు. ఈ క్రమంలో ఈ నెల 13న అభిషేక్ తన స్నేహితులైన సునీల్, కెంపేగౌడలతో పీకలదాకా మద్యం తాగాడు.

ఈ క్రమంలో అభిషేక్ మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియక దినేశ్ మరణం గురించి బయటకు కక్కేశాడు. మనం (అభిషేక్, సునీల్, కెంపేగౌడ, దినేశ్) మంచి ఫ్రెండ్స్‌ కదా.. అయితే మీకు తెలియకుండా నేనో పెద్ద తప్పుచేశానన్నాడు.

ఆ రోజు నాయండహళ్లిలోని ఓ వైన్ షాపులో అందరం పార్టీ చేసుకున్నాం. ఆ సమయంలో దినేశ్ కూడా ఉన్నాడు. మీరు ఇళ్లకు వెళ్లిపోయారు తర్వాత నేను దినేశ్‌ని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లా. ఆ సమయంలో నగదు విషయంలో మా ఇద్దరికి గొడవ జరిగింది.

ఆ సమయంలో కోపంతో మైసూరు నుంచి వెళుతున్న రైలు కిందకి దినేశ్‌ని తోసేసి హత్య చేసినట్లు అభిషేక్ చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన మిగిలిన స్నేహితులు వెంటనే దినేశ్ తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పేశారు.

ఆ తర్వాతి రోజున నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిందితుడిని దినేశ్ సమాధి వద్దకు తీసుకెళ్లగా సమాధిపై ఉన్న స్నేహితుడి ఫోటోను చూసి అతను కన్నీరు పెట్టాడు.

మరోవైపు దినేశ్ చనిపోయినప్పుడు అభిషేక్ ఇంటికి రాలేదు, తిథి కార్యానికి రాలేదు. వాళ్లిద్దరూ ప్రాణస్నేహితులు కావడంతో దు:ఖంలో ఉండి రాలేకపోయి ఉంటాడని భావించామని దినేశ్ తండ్రి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.