జమ్మూకశ్మీర్ లో మళ్లీ ఆంక్షలు విధించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా... గత 26రోజులుగా కశ్మీర్ లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మార్కెట్లు, ప్రజా రవాణా మూతపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో ఫోన్ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ... మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొనసాగుతున్నాయి.

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కశ్మీర్ లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా... భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ శుక్రవారం శ్రీనగర్ లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన కశ్మీర్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా ఆయన కశ్మీర్ లో భద్రతా తీరును పర్యవేక్షించనున్నారు. జమ్మూలోని పరిస్థితిని త్వరలోనే సాధారణ స్థితికి తీసుకురావాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ చెబుతున్న నేపథ్యంలో భద్రతా దళాల తీరును పరీక్షించడానికి ఆయన వెళ్లనున్నారు.