ప్రాథమిక హక్కుగా ఉన్న వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ‌‌కు (freedom of speech and expression) సహేతుకమైన పరిమితులుఉన్నాయని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రాథమిక హక్కుగా ఉన్న వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ‌‌కు (freedom of speech and expression) సహేతుకమైన పరిమితులుఉన్నాయని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రధాని మోదీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినందుకు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఓ వ్యక్తి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. వివరాలు.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటుగా పలువురిపై Jaunpurకు చెందిన ముంతాజ్ మన్సూరీ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌ పోస్టులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 

ఈ క్రమంలోనే తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని నిందితుడు ముంతాజ్ మన్సూరీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. అతని పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ అశ్వనీ కుమార్ మిశ్రా, జస్టిస్ రాజేంద్ర కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ధర్మాసనం కీలకం వ్యాఖ్యలు చేసింది. ఇతర పౌరులను.. ముఖ్యంగా భారత ప్రభుత్వంలోని ప్రధానమంత్రి, లేదా మంత్రుల వంటి ముఖ్యమైన వ్యక్తులను దూషించేవారికి వాక్ స్వాతంత్ర్యం వర్తించదని పేర్కొంది.

ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు నిరాకరించిన హైకోర్టు.. నిందితుడు మన్సూరిపై cognizable offence (విచారణ యోగ్యమైన నేరం) కింద అభియోగాలు మోపబడ్డాయని పేర్కొంది. “ఎఫ్‌ఐఆర్‌ గుర్తించదగిన నేరాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. అటువంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను రద్దు చేయమని కోరుతూ దాఖలు చేసిన ప్రస్తుత రిట్ పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి మాకు మంచి కారణం కనిపించడం లేదు’’ అని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే చట్టం ప్రకారం ఈ విషయంలో ముందుకు సాగాలని ఆదేశించింది. విచారణను వీలైనంత త్వరగా ముగించాలని సూచించింది. ఇక, విచారణ సమయంలో మన్సూరి తరపున న్యాయవాదులు అకీల్ అహ్మద్, మహ్మద్ సైఫ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సయ్యద్ అలీ ముర్తాజా వాదించారు.

ఇక, ప్రధాన మంత్రి, హోం మంత్రి, ఇతర మంత్రులను..కుక్క అని దూషిస్తూ అత్యంత అభ్యంతరకరమైన పోస్ట్ చేసినందుకు నిందితుడిపై కేసు నమోదు చేయబడింది. అతనిపై ఐపీసీలోని సెక్షన్ 504 సెక్షతో పాటుగా ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.