మహిళలకు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త తెలియజేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తూ... తాజాగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకునేవిధంగా మహిళలను ప్రోత్సహించేందుకు ఢిల్లీ రవాణా సంస్థ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రకటనను అక్టోబర్ 29వ తేదీ నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు గురువారం ఆయన వెల్లడించారు.  అక్టోబర్ 29వ తేదీ నుంచి ఢిల్లీ రవాణ శాఖ పరిధిలో ఉన్న బస్సులో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్, ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులతో ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ పలుమార్లు చర్చలు జరిపారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ లో ప్రయాణించే మహిళలకు టికెట్లను రద్దు చేయడంపై ఆయా ప్రతినిధులను ఢిల్లీ ప్రభుత్వం ఒప్పించగలిగింది. ఇందులో భాగంగా ఢిల్లీ బస్సులో అక్టోబర్ 29 నుంచి టికెట్ కు డబ్బులు వసూలు చేయకుండా ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు.