కాశీ, మథుర ఇచ్చేస్తే వేరే మసీదులను అడగం: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ కోశాధికారి
కాశీ, మథుర ఇచ్చేస్తే మరే ఇతర మసీదులను హిందు సమాజం కోరుకోదని అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ తెలిపారు. ముస్లిం సమాజం ఈ రెండు ఆలయాలను ప్రేమపూర్వకంగా, శాంతియుతంగా తమకు అప్పగించాలని కోరారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి మహారాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశీ, మథురను శాంతియుతంగా, ప్రేమ పూర్వకంగా అప్పజెబితే మిగిలిన మసీదులను హిందూ సమాజం అడగదు అని అన్నారు. కాబట్టి, అయోధ్య తరహాలోనే ఈ రెండు కూడా శాంతియుతంగా తమకు అప్పగించాలని కోరారు. మహారాష్ట్రలోని పూణెలో ఆయన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
గోవింద్ దేవ్ గిరి మహారాజ్ 75వ పుట్టిన రోజు సందర్భంగా అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాకు ఈ రెండు ఆలయాలు ప్రేమతో, శాంతియుతంగా అప్పగిస్తే.. మిగిలిన విషయాలు అన్నింటిని వదిలిపెడతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, శ్రీశ్రీ రవిశంకర్, ఇతర ప్రముఖ సంతులు, సాధువులు వచ్చారు.
Also Read: Lok Sabha Seat: టికెట్ల కోసం సీనియర్ల ఆరాటం.. కాంగ్రెస్ హైకమాండ్ పై పెరుగుతున్న ఒత్తిడి
‘దురాక్రమణదారులు అనేక మందిరాలను నేలమట్టం చేశారు. మసీదులు నిర్మించారు. ఇవి అలాంటి వాటికి నిదర్శనాలు. అందుకే ఈ రెండు ఆలయాలను అయోధ్యలోని రామ మందిరం వలెనే మాకు వదిలిపెట్టాలి. ఇదే శాంతియుత పరిష్కారం’ అని వివరించారు. ముస్లిం సమాజంలోని మెజార్టీ ప్రజలు ఈ రెండు ఆలయాలకు సంబంధించిన వివాదం శాంతియుతంగా పరిష్కృతం కావాలని కోరుకుంటున్నారని, కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. అయితే.. శాంతియుత వాతావరణంలోనే ఈ రెండు ఆలయాలు హిందు సమాజానికి దక్కడానికి అందరినీ ఒప్పిస్తామని పేర్కొన్నారు.