ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఫ్రాన్స్ పర్యటనకు ముందు ఆ దేశం కీలక ప్రకటన చేసింది. భారత్ ప్రతిపాదించిన పీ-75ఐ ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటున్నట్టు ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్ ఈ రోజు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కింద అధునాతన ఏఐపీ వ్యవస్థతో ఆరు సబ్‌మెరైన్లను భారత్‌కు తయారు చేసి ఇవ్వాలి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆ టెక్నాలజీని భారత్‌కు బదలాయించాలి.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జర్మనీ నుంచి తన మూడు రోజుల పర్యటన మొదలుపెట్టారు. ఫ్రాన్స్‌తో పర్యటన ముగించుకుని భారత్‌కు రేపు తిరిగిరానున్నారు. ఆయన రేపు ఫ్రాన్స్‌కు వెళ్లనున్న సందర్భంలో ఆ దేశం కీలకమైన సబ్‌మెరైన్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఈ ప్రాజెక్టు కింద సబ్‌మెరైన్‌లను భారత కంపెనీలతో కలిసి తయారు చేయాల్సి ఉంటుంది. టెక్నాలజీని కూడా భారత కంపెనీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్ పీ-75ఐ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కింద భారత నావికా దళానికి ఆరు సాంప్రదాయ సబ్‌మెరైన్లు తయారు చేసి ఇవ్వాల్సి ఉంది. అయితే, ఈ ప్రాజెక్టులో తయారు చేసే ఆరు సబ్‌మెరైన్లను ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) సిస్టమ్ ఉండాలని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్‌పీ)లో భారత్ పేర్కొంది. ఈ ఏఐపీ విధానం వల్ల కన్వెన్షన్ సబ్‌మెరైన్లు, అత్యధిక వేగంతో వెళ్లుతున్నా దీర్ఘకాలం నీటిలోనే ఉండే సామర్థ్యం సబ్‌మెరైన్లకు కలుగుతుంది. అందుకే భారత్ ఈ సిస్టమ్‌ను కావాలని కోరింది.
కానీ, ఫ్రెంచ్ నావికా దళం ఆ టెక్నాలజీ వినియోగించలేదని, కాబట్టి, దాన్ని రూపొందించడం వీలు కాదనే కారణం చెబుతూ నావల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ లారెంట్ విడూ మంగళవారం వెల్లడించారు. ఆర్ఎఫ్‌పీలో భారత్ చేసిన విజ్ఞప్తుల కారణంగా తమకు, తమతోపాటు మరికొన్ని ఫారీన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ (ఎఫ్‌వోఈఎం)లకు రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయలేరని తెలిపారు. కాబట్టి, తాము ఈ ప్రాజెక్టు కోసం అధికారికంగా బిడ్ వేయలేకపోతున్నామని చెప్పారు. అయితే, భారత నావికా దళానికి వీలైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి నావల్ గ్రూప్ సిద్ధంగా ఉన్నదని వివరించారు.
గతేడాది జూన్‌లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ పీ-75ఐ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులకు అనుగుణంగానే ప్రాజెక్టు కోసం రెండు భారత కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. అందులో ఒక ప్రైవేటు కంపెనీ ఎల్ అండ్ టీ, మరో ప్రభుత్వ కంపెనీ మజగావ్ డాక్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు ఐదు నిర్దేశిత ఎఫ్‌వోఈఎంలతో టై అప్ కావాలి. ఈ ఐదు ఎఫ్‌వోఈఎంలలో ఒకటి జర్మనీకి చెందిన థిస్సెంక్రప్ మెరైన్ సిస్టమ్స్, స్పెయిన్‌కు చెందిన నవాంటియా, ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్, దక్షిణ కొరియాకు చెందిన దాయివూ, రష్యాకు చెందిన రోసోబోరోన్ ఎక్స్‌పోర్టులు ఉన్నాయి.
భారత కంపెనీ, విదేశీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం రూ. 43 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను వారికి అప్పగిస్తుంది. కానీ, ఈ డీల్ ఇంకా కుదరకమునుపే తాము ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది.
అయితే, ఈ దేశాలు తమ వద్ద ఉన్న అధునాతన, తమకే చెందిన టెక్నాలజీని భారత్‌తో పంచుకోవడానికి వెనుకాముందు ఆడుతున్నాయనే వాదనలూ ఉన్నాయి. ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మిలిటరీ సంపదపై ఇతర దేశాలపై ఆధారపడవద్దని భావిస్తున్నది.
