Asianet News TeluguAsianet News Telugu

కమ్యూనిటీ కిచెన్ల కోసం మోడల్ స్కీమ్‌ను రూపొందించండి.. కేంద్రాన్ని కోరిన సుప్రీం కోర్టు..

ఆకలిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా community kitchensను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో సంప్రదించి 'నేషనల్ మోడల్ స్కీమ్'ను రూపొందించాలని Supreme Court కీలక ఆదేశాలు జారీచేసింది. ఆకలి కారణంగా మరణించిన వారి గణాంకాలను, తాజా సమాచారాన్ని ప్రభుత్వం తమకు అందించాలని కోరింది. 

Frame model scheme for community kitchens Supreme Court tells To Centre
Author
New Delhi, First Published Jan 18, 2022, 3:56 PM IST

ఆకలిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా community kitchensను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో సంప్రదించి 'నేషనల్ మోడల్ స్కీమ్'ను రూపొందించాలని Supreme Court కీలక ఆదేశాలు జారీచేసింది. ఆకలి కారణంగా మరణించిన వారి గణాంకాలను, తాజా సమాచారాన్ని ప్రభుత్వం తమకు అందించాలని కోరింది. లాజిస్టిక్స్, వనరులు, రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను  విస్తరించడాన్ని ఈ పథకం పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఆకలి చావులను నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్ పాలసీని రూపొందించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ AS Bopanna, జస్టిస్ Hima Kohli‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలి మరణాలను నివేదించకపోవడాన్ని బట్టి.. దేశంలో ఆకలి చావులు లేవని అర్థం చేసుకోవాలని అని కేకే వేణుగోపాల్‌ను సీజేఐ ప్రశ్నించారు. ఆకలి మరణాలపై భారత ప్రభుత్వం డేటాను, తాజా సమాచారాన్ని తమకు అందజేయాలని తెలిపారు. ‘డేటా ఇవ్వమని మీ అధికారిని అడగండి..’ అని Chief Justice NV Ramana.. కేకే వేణుగోపాల్‌తో అన్నారు. 

‘ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఎన్నో రకాల ఉచితాలను ప్రకటిస్తాయి.. కానీ ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి నేను ఎక్కువగా వ్యాఖ్యానించదలచుకోలేదు’ అని సీజేఐ రమణ అన్నారు. ఇక, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆకలి, ఆకలి సమస్యలపై రాజకీయ పార్టీలు ఆలోచించాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. రాష్ట్రాలు.. పోషకాహార లోపం, ఆకలి చావులు, సంబంధిత సమస్యలపై రెండు వారాల్లోగా సుప్రీం కోర్టు డేటా ఇవ్వాలని కోరింది. 

ప్రజలు ఆకలితో బాధపడకూడదనేది తమ ఆలోచన అని సీజేఐ ఎన్వీ రమణ చెప్పారు. ‘నోడల్ పథకాన్ని రూపొందించడానికి మీరు మీ అధికారులతో చర్చించాలి. మేము ఈ కోర్టు ఉద్దేశాన్ని వివరించాము. ఇప్పుడు మీరు పరిష్కారాన్ని అన్వేషించాలి. లాజిస్టిక్స్ విషయానికి వస్తే.. రాష్ట్రాలతో కలిసి పని చేయవచ్చు. మేము పోషకాహార లోపం వంటి పెద్ద సమస్యలపై మాట్లాడటం లేదు.. ఆకలిని తీర్చాలి. ప్రతి ఒక్కరూ సమస్య ఉందని అంగీకరిస్తున్నారు. మానవతా దృక్పథాన్ని కలిగి ఉండండి. దీనిపై దృష్టి పెట్టమని మీ అధికారులను అడగండి’ అని కేకే వేణుగోపాల్‌తో సీజేఐ రమణ అన్నారు. 

ఇక, ఆకలి చావుల డేటా కోసం 2015-2016 నివేదికపై ఆధారపడినందుకు సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దేశంలో 1 మినహా ఆకలి చావులు లేవని మీరు చెబుతున్నారా? మేము ఆ ప్రకటనపై ఆధారపడగలమా?’ అని నిలదీసింది. ఆకలితో అలమటించేవారి కోసం ప్రభుత్వం ఏం చేయడం లేదని తాము చెప్పడం లేదని అటార్ని జనరల్‌తో సీజేఐ రమణ అన్నారు. జాతీయ స్థాయిలో model schemeను పరిగణించాలని చెప్పారు. ‘ఒక పథకాన్ని రూపొందించి, ఖరారు చేసి.. దానిని రాష్ట్రాలకు వదిలిపెట్టాలి’ అని తెలిపారు. 

కోర్టు సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని ఏజీ బదులిచ్చారు. దీనిపై స్పందించిన కేకే వేణుగోపాల్.. ఇందుకు సంబంధించి ఇప్పటికే 134 పథకాలు ఉన్నాయని.. ఇకపై రాష్ట్రాలకు నిధులు మళ్లించలేమని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు ఇస్తున్నామని కోర్టుకు తెలుపగా.. అదనపు ఆహార ధాన్యాన్ని అందించడాన్ని పరిశీలించాలని సీజేఐ ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. 

ఈ క్రమంలోనే స్పందించిన ఏజీ..‘మేము ఈ 2% అదనపు ఆహార ధాన్యంతో ఒక పథకాన్ని తయారు చేయవచ్చు.. అది రాష్ట్రాలకు అందుబాటులో ఉంటుంది’ అని తెలిపారు. ఇక, పౌష్టికాహార లోపం, ఆకలి తదితర సమస్యలపై రాష్ట్రాలు అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. అనంతరం కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios