2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జైషే ఉగ్రవాది భారత జవాన్లపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఆత్మాహుతి దాడిలో నలభై మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి జరిగి నాలుగేళ్లు గడుస్తున్న సందర్భంగా వాటిని మరోసారి పరిశీలిద్దాం. 

న్యూఢిల్లీ: 2019 ఫిబ్రవరి 14. భారత చరిత్రలో ఒక విషాద దినంగా నిలిచింది. సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్)లపై ఆత్మాహుతి దాడి జరిగింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఈ ఉగ్ర దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. అందుకే ఫిబ్రవరి 14వ తేదీన బ్లాక్ డేగా పాటిస్తున్నారు. ఈ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మిలిటరీ దాడులు జరిగాయి. 2019 ఫిబ్రవరి 14న, ఆ తర్వాత పరిణామాలను ఓ సారి మననం చేసుకుందాం.

2019 ఫిబ్రవరి 14:

- ప్యారామిలిటరీ వాహనాలు వరుసగా వెళ్లుతున్నాయి. అవి దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా గుండా వెళ్లుతుండగా కాన్వాయ్‌లోని రెండు వాహనాలను ఓ సూసైడ్ బాంబర్ టార్గెట్ చేసుకున్నాడు. ఓ కారులో ఐఈడీతో వచ్చి నేరుగా ఢీకొన్నాడు. ఆ రెండు బస్సుల్లోని 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

-ఈ దాడి జరిగిన కొద్ది సేపటికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఈ ఘాతుకానికి బాధ్యత తమదే అని పేర్కొంది. ఆ వీడియోలో సూసైడ్ బాంబర్ తనను తాను కశ్మీరి జిహాదిస్ట్ ఆదిల్ అహ్మద్ దర్‌గా చెప్పుకున్నాడు. పుల్వామా జిల్లాలోని కాకపోరాలో గుండిబాగ్ నివాసి అని పేర్కొన్నాడు

2019 ఫిబ్రవరి 15:

-దాడి జరిగిన తర్వాత రోజు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నదని ఆరోపించింది. జైషే నేత మసూద్ అజర్‌కు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, భారత్ సహా వేరే ప్రాంతాల్లోనూ దాడులు చేయడానికి, దాని ఉగ్ర సదుపాయాలను విస్తరించుకోవడానికి అతనికి స్వేచ్ఛ ఇచ్చిందని పేర్కొంది.

-పుల్వామా దాడిలో తమ హస్తం లేదని పాకిస్తాన్ ఖండించింది. కాగా, మసూద్ అజర్ టెర్రరిస్టు కాడని చైనా దాని వైఖరిని పునరుద్ఘాటించింది.

-ఇలాంటి దాడులతో భారత్‌ను బలహీనపరచలేరని పాకిస్తాన్‌కు ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. దీనికి భారీ మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించాడు. ఉగ్రవాదులను డీల్ చేయడానికి రక్షణ బలగాలు స్వేచ్ఛ ఇస్తామని తెలిపారు.

-పుల్వామా ఉగ్రదాడి తర్వాత జమ్ము కశ్మీర్‌లో మరెలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా కర్ఫ్యూలు విధించారు. లా అండ్ ఆర్డర్ కోసం మిలిటరీ ఫోర్స్‌ మోహరించింది.

-పాకిస్తాన్ పై భారత్ దౌత్య మార్గంలోనూ దాడికి సిద్ధమైంది. 25 దేశాల దూతలతో పుల్వామా దాడిని జైషే ఉగ్ర సంస్థ చేసిన విధాన్ని వివరించింది.

-జైషేతో సంబంధాలున్న కనీసం ఏడుగురుని పుల్వామా నుంచి అదుపులోకి తీసుకున్నారు.

2019 ఫిబ్రవరి 16:

-రాజకీయ పార్టీలు అన్నీ రక్షణ బలగాలకు మద్దతునిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశఆయి. ఆ తర్వాత పాకిస్తాన్ సరుకులపై కస్టమ్ డ్యూటీని 200 శాతం పెంచారు.

-భారత్ అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెచ్చిన తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి దాడికి బాధ్యులైనవారిని పట్టుకోవడానికి సహకరిస్తామని పేర్కొన్నారు.

- పాకిస్తాన్‌ను ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టులో చేర్చాలని భారత ప్రభుత్వం కోరింది. ఫిబ్రవరి 17న జమ్ము కశ్మీర్‌లో వేర్పాటువాదులకు సెక్యూరిటీ కవర్‌ను తొలగించింది.

2019 ఫిబ్రవరి 26:

-దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఫిబ్రవరి 26 తెల్లవారుజామున భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ఖైబర్ పక్తుంక్వాలో బాలాకోట్‌లోని జూషే క్యాంపులపై బాంబులువ ేసింది. 1971 యుద్ధం తర్వాత తొలిసారి భారత యుద్ధ విమానాలు ఎల్‌వోసీ దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించాయి.

-ఈ ఆపరేషన్ కోసం 12 యుద్ధ విమానాలు (మిరాజ్ 2000) లు ఉపయోగించినట్టు కథనాలు వచ్చాయి. ఈ విమానాలు సుమారు 1000 కచిలోల బాంబులను ఎల్‌వోసీ గుండా పాకిస్తాన్ వైపు ఉన్న జైషే క్యాంపులపై విడిచాయి. పాకిస్తాన్‌లోని బాలాకోట్ సెక్టార్‌లోని జైషే క్యాంపులను పూర్తిగా నాశనం చేసినట్టు కథనాలున్నాయి.

2019 పిబ్రవరి 27:

-పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. అవి భారత మిలిటరీ సంస్థలపై దాడి చేసే లక్ష్యంతో వచ్చినట్టు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. వాటిని భారత్ మిగ్ యుద్ధ విమానాలు వెనక్కి వెళ్లగొట్టాయి. ఇందులో రెండు మిగ్ 21 యుద్ధ విమానాలు, పాక్‌కు చెందిన ఎఫ్ - 16 యుద్ధ విమానం కూలిపోయాయి.

-పాకిస్తాన్ ఇద్దరు భారత వైమానిక దళ పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత తమ కస్టడీలో ఒక్కరే ఉన్నారని మరో ప్రకటనలో తెలిపింది. ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసి అతను తమ కస్టడీలోనే ఉన్నట్టు పేర్కొంది.

-ఒక ఐఏఎఫ్ పైలట్ మిస్ అయినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ధ్రువీకరించింది.

2019 ఫిబ్రవరి 28:

-శుక్రవారంనాడు ఐఏఎఫ్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్‌ ను విడుదల చేస్తామని పాకిస్తాన్ అప్పటి పీఎం ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు.

- మూడు సర్వీసుల చీఫ్‌లు విలేకరుల సమావేశంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత్‌ పై ఫిబ్రవరి 27న వైమానిక దాడులు చేయడానికి వచ్చినట్టు ఆధారాలు బయటపెట్టారు.