శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

గురువారం సాయంత్రం ఓంపోరా హౌసింగ్ కాలనీలోని వాళ్లింటి లాన్ లో ఆడుకుంటున్న అధా షకీల్ ఆ తరువాత కనిపించకుండా పోయింది. శుక్రవారం ఉదయం జరిగిన సెర్చ్ ఆపరేషన్లో సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు.

ఈ ఘటన మీదట డిప్యూటీ కమిషనర్ షాబాజ్ మీర్జా.. సీనియర్ పోలీసు అధికారులు, అటవీ,  వన్యప్రాణి విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఓంపోరా అడవులతో పాటు చుట్టుపక్కల ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి.. అక్కడున్న చెత్తచెదారాలను శుభ్రం చేయించడం కూడా ఇందులో ఒకటి. 

ఓంపోరా అడవులలో ప్రస్తుతం ఉన్న చైన్-లింక్ ఫెన్సింగ్ నిర్మాణాన్ని మరింత స్ట్రాంగ్ చేయడానికి అటవీ శాఖ వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనికి కావాల్సిన నిధుల కోసం ఉన్నత అధికారులకు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సమర్పించనుంది.

పై అధికారుల అనుమతితో.. వైల్డ్ లైఫ్ వార్డెన్ సిబ్బంది నియామకం, పులిని చంపే ఆయుధాల ఏర్పాటు చేసుకోనుంది. చిరుతపులి మ్యాన్ ఈటర్ గా మారింది. దీనివల్ల మరిన్ని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడమే ముందే చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

వైల్డ్ లైఫ్ డిపార్ట్ మెంట్ సిబ్బంది ఓంపొరా అడవుల సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహించడం, సాధారణ ప్రజలలో అవగాహన కల్పించడం చేస్తారు.