పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించడంపై దేశప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అమరవీరులకు కన్నీటి వీడ్కోలు పలుకుతూనే, వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు.

ఈ క్రమంలో జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. పుల్వామా దాడి తమ ప్రతీకారానికి ధీటైన సమాధానం అంటూ విద్యార్థినుల్లో ఒకరైన తల్వీన్ తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై వర్సిటీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. నిమ్స్ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను సహించదని, వీరిని కాలేజ్‌తో పాటు హాస్టల్‌ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడిచింది. అనంతరం దేశ వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసినందుకు గాను పోలీసులకు అప్పగించింది.