ఇంట్లోకి పొరపాటున పాము దూరితే ఎవరైనా ఏం చేస్తారు. భయంతో చంపేసేవాళ్లు కొందరు ఉంటారు. మరికొందరేమో.. పాములను పట్టేవాళ్లను పిలిచి.. వాటిని ఎక్కడైనా వదిలేస్తారు. కానీ.. నలుగురు వ్యక్తులు మాత్రం వింతగా ప్రవర్తించారు. ఇంట్లో దూరిన పామును చంపి వండుకొని తిన్నారు. కాగా.. పాము పట్ల అంత క్రూరంగా ప్రవర్తించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన  తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సేలం జిల్లా మేట్టూరు తంగమామునిపట్టణానికి చెందిన శివకుమార్‌(40) తన ఇంట్లో ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సురేష్‌, మహమ్మద్‌ హుస్సేన్‌తో కలసి పామును చంపి చిన్న ముక్కలుగా చేశారు. మరో మిత్రుడు జయప్రకాష్‌తో కలసి కాళియమ్మన్‌ ఆలయ వెనుక  కూర వండుకుని తిన్నారు. ఈ దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా పంపించారు. అటవీ శాఖ చట్టం ప్రకారం పామును చంపడం నేరం కావడంతో మేట్టూరు అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టి, వారిని అరెస్టు చేశారు.