Breaking : కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్ధులు మృతి, 40 మందికి పైగా గాయాలు
కేరళ రాష్ట్రం కొచ్చిలోని కలమస్సేరిలో వున్న యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ క్యాంపస్‌లో జరిగిన టెక్ ఫెస్ట్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్‌ను తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో పోటెత్తారు.
కేరళ రాష్ట్రం కొచ్చిలోని కలమస్సేరిలో వున్న యూనివర్సిటీ ఆఫ్ కొచ్చిన్ క్యాంపస్‌లో జరిగిన టెక్ ఫెస్ట్ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు విద్యార్ధులు దుర్మరణం పాలవ్వగా.. 46 మంది తీవ్రంగా గాయపడ్డారు . మృతులను కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. క్యాంపస్‌లోని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రాత్రి 7 గంటలకు తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక్కసారిగా వర్షం పడటంతో విద్యార్థులు లోపలి వైపుకు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.
ప్లేబ్యాక్ సింగర్ నిఖితా గాంధీ లైవ్ కాన్సర్ట్‌ను తిలకించేందుకు విద్యార్థులు భారీ సంఖ్యలో పోటెత్తారు. తొక్కిసలాటలో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన విద్యార్థులను కలమస్సేరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూ , వైద్య సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వైద్యులతో సహా ఆరోగ్య కార్యకర్తలు కలమసేరి మెడికల్ కాలేజీ , ఎర్నాకులం జనరల్ హాస్పిటల్‌కు చేరుకున్నారని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. తదుపరి ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ డైరెక్టర్, వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌లను ఆమె ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులను కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. తగినంత పరిమాణంలో 108 అంబులెన్స్‌లను సిద్ధం చేయాలని సూచించారు. ఘటనపై ఎర్నాకులం జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడామని ఘటనా స్థలానికి వెళుతున్నామని మంత్రి పి. రాజీవ్ అన్నారు.