పెద్ద కుమారుడి మరణం ఆ కుటుంబాన్ని కలిచివేసింది. కొడుకు లేని జీవితం వ్యర్థం అనుకున్నారు అంతే కుటుంబంలో మిగిలిన నలుగురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెడితే.. సేలం జిల్లా అమ్మాపేట సమీపంలోని వలకాడుకు చెందిన మురుగన్, కోకిల దంపతులకు ముగ్గురు కొడుకులు. మురుగన్ దగ్గర్లోని ఓ సెలూన్ లో పనిచేస్తున్నాడు. 

సోమవారం ఉదయం ఆ ఇంటి తలుపులు ఎంతకు తెరచుకోలేదు. దీంతో పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో మురుగన్, కోకిల, వసంతకుమార్, కార్తీక్‌లు విగతజీవులుగా పడివున్నారు. మృతదేహాలను పరిశీలించగా అందరూ విషం సేవించినట్టు తేలింది. 

సేలం అమ్మాపేట పోలీసులు కేసు నమోదు చేసిన మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. విచారణలో 8 నెలల క్రితం పెద్దకుమారుడైన మదన్‌ కుమార్‌ క్యాన్సర్‌తో మరణించినట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగింది. 

స్థానికులతోసరిగ్గా మాట్లాడకుండా పెద్దకుమారుడిని తలచుకుంటూ అతడి ఫొటో వద్దే మురుగన్, కోకిల్‌ కూర్చుని ఉండేవారు. మురుగన్‌ పనికి వెళ్లడం మానేశాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఇద్దరు కుమారులకు విషమిచ్చి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.