కర్ణాటక లింగాయత్ మఠాధిపతి శివమూర్తి శరణారుపై ఇద్దరు బాలికల లైంగిక దాడి ఆరోపణలు చేయడంతో కేసు నమోదైంది. తాజాగా, మరో నలుగురు బాలికలు ఈ ఆరోపణలు చేశారు. దీంతో మరో కేసు నమోదైంది. 

బెంగళూరు: కర్ణాటక లింగాయత్ మఠాధిపతి శివమూర్తి శరణారుపై తాజాగా మరో సారి లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉన్న మఠాధిపతి శివమూర్తి శరణారుపై తాజాగా మరో నలుగురు మైనర్లు లైంగికదాడి ఆరోపణలు చేశారు. కొన్ని ఏళ్లుగా వారిపై లైంగికదాడికి గురైనట్టు వారు ఆరోపించారు. వీరి ఆరోపణలతో కేసు నమోదైంది. జనవరి 2019 నుంచి జూన్ 2022 మధ్య కాలంలో ఆయన చాలా సార్లు లైంగికంగా తమపై దాడి చేశాడని ఆరోపించినట్టు అధికారులు వివరించారు.

లింగాయత్ మఠాధిపతి శివమూర్తి శరణారు, మఠానికి చెందిన హాస్టల్ వార్డెన్‌తోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది. 

మఠం హాస్టల్‌లో మైనర్ బాలికల పై లైంగికదాడికి పాల్పడిన ఆరోపణలతో శివమూర్తి శరణారుపై పోక్సో చట్టం కింద ఇది రెండో కేసు. 

Also Read: లింగాయత్ మఠాధిపతికి నాలుగు రోజుల క‌స్ట‌డీ.. వీల్ చైర్ లో కోర్టుకు హాజ‌రు..

శివమూర్తి శరణారుపై తొలుత ఇద్దరు మైనర్ బాలికలు రేప్ ఆరోపణలు చేశారు. ఈ కేసులోనే ఆయనను సెప్టెంబర్ నెలలో అరెస్టు చేశారు. ఆ ఇద్దరు బాలికలు మైసూరులోని ఓ ఎన్జీవో సంస్థను ఆశ్రయించారు. దాని సహాయంతో ఈ బాలికల ఆరోపణలపై ఆగస్టు 26వ తేదీన కేసు ఫైల్ అయింది.

బాధితుల్లో ఒకరు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వారు. దీంతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కూడా ఆయనపై కేసు నమోదైంది.

లింగాయత్‌లపై ఈ మఠాధిపతికి ఎక్కువ ప్రభావం ఉన్నది.