వేసవి తాపాన్ని తీరుస్తుందనుకున్న ఏసీ.. వారి పాలిట మృత్యుశకటంలా మారింది. ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు.
బెంగళూరు : ఎండాకాలం అని చల్లగా AC వేసుకొని సేదతీరుతున్నారా అయితే కొంచెం జాగ్రత్త వహించాల్సిందే.. వేసవి తాపాన్ని తగ్గిస్తుందనుకుంటే ఏకంగా ప్రాణాల్నే తీసేయచ్చు. కర్నాటకలోని బెంగళూరులో ఇలాంటి విషాదమే జరిగింది. ఏసీ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా మిరియంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఏసీ నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించింది.
దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ప్రశాంత్ (42), అతడి భార్య డి. చంద్రకళ(38), కుమారుడు అద్విక్(6), కుమార్తె ప్రేరణ(8) మంటల్లో చిక్కుకుని మరణించారు. ఇళ్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా అనే అంశంపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. కుటుంబానికి ఏమైనా అప్పులు ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఈ జనవరిలో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగింది. ప్రతి ఇంట్లో ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే టీవి ఆ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా భారీశబ్దం చేస్తూ టివి పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.
విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదానికి గురయ్యారు. నిన్న ఆదివారం సెలవురోజు కావడంతో చిన్నారులిద్దరూ ఇంట్లోనే వున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా ఓ పాత టీవీ దగ్గర ఆడుకుంటుండగా వారూ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు. వారికి అతి సమీపంలో వున్న టీవి హటాత్తుగా భారీ శబ్దంతో పేలిపోవడంతో అక్కడే వున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
టివిలో వుండే పిక్చర్ ట్యూబ్ పేలిపోవడంతో అందులో వుండే రసాయనాలు చిన్నారుల ముఖం, చేతులపై పడి గాయాలయ్యాయి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు చిన్నారులిద్దరినీ కేజిహెచ్ కు తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ క్షేమంగానే వున్నట్లు... చికిత్స అందిస్తున్నట్లు జిజిహెచ్ డాక్టర్లు తెలిపారు.
