ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. నలుగురు టెక్కీలు మృతి..
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగుళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బిజీ నగారా గ్రామ సమీపంలో బెంగుళూరు-మంగళూరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. వీరంతా సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఉద్యోగులు అని సమాచారం. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. మృతులను నమిత, రఘునాథ్ భజంత్రీ, పంకజ్ శర్మ, వంశీకృష్ణగా గుర్తించారు.
హాసన్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ).. ఆదిచుంచనగిరి మెడికల్ హాస్పిటల్ సమీపంలో ప్రయాణికులు దిగేందుకు రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు బస్సును వెనకాల నుంచి ఢీకొట్టింది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేరపట్టారు. కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి బెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.