ఆగ్రాలో గోవధకు కుట్ర చేసి మత అల్లర్లు సృష్టించాలని భావించిన నలుగురు హిందూ మహాసభ నేతలను ఆగ్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్న రోజునే వీరి ఆదేశాల మేరకు మరో నలుగురు గోవును వధించినట్టు పోలీసులు తెలిపారు.
ఆగ్రా: నలుగురు హిందూ మహాసభ నేతలు గోవధకు కుట్ర చేశారని, తద్వార మత అల్లర్లు సృష్టించి యూపీలోని ఆగ్రాలో ఉద్రిక్తతలు సృష్టించారని ఆగ్రా పోలీసులు తెలిపారు. ఆ నలుగురిని అరెస్టు చేశారు.
రామనవి వేడుకలు జరుగుతుండగా గౌతమ్ నగర్‌లోని ఎత్మాదుద్దౌలా ఏరియాలో మత అల్లర్లు సృష్టించడానికి గోవును వధించారని పోలీసులు పేర్కొన్నారు. ఏప్రిల్ 7వ తేదీన గౌతమ్ నగర్‌లో గోవధకు సంబంధించి నకీమ్, రిజ్వాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శాను, బిట్టుల కోసం గాలించారు. అదుపులోకి తీసుకున్న నకీమ్, రిజ్వాన్‌లు పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. హిందూ మహాసభ నేతలు సంజయ్ జాట్, సౌరభ్ శర్మ, జితేంద్ర కుశ్వాహా, బ్రజేష్ భదౌరియాల ఆదేశాల మేరకు తాము గోవును వధించినట్టు తెలిపారు.
గోవును నకీమ్, ఆయన సహచరులు వధించారని, కానీ, దీనికి హిందూ మహాసభ నేతలు సంజయ్ జాత్, ఇతరులు కుట్ర చేశారని, తద్వరా నగరంలో మత అల్లర్లు సృష్టించాలని భావించారని ఏసీపీ ఆర్‌కే సింగ్ తెలిపారు. ఈ నలుగురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిపై ఇది వరకే పలు కేసులు ఉన్నాయి.
Also Read: ఆయుధాలకు కొదవలేదు.. పాక్ ఐఎస్ఐతో డైరెక్ట్ లింకులు: అతీక్ అహ్మద్ పై యూపీ పోలీసు చార్జిషీట్
ఈ మొత్తం ఉదంతాన్ని ఆగ్రా పోలీసు కమిషనర్ దర్యాప్తు చేశారు. రామనవమి వేడుకలు జరుగుతుండగా రాత్రి 1.30 గంటల ప్రాంతంలో గోవును వధించారని కనుగొన్నారు. ఈ గోవధ గురించి హిందూ సభ సభ్యులకు తెలుసని, ఎవరు వధించినదీ వారికి తెలుసు. దీంతో పోలీసులు అనుమానంతో సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలు సేకరించారు.
