కర్ణాటక చిక్కబళ్లాపూర్ చెరువులో పడిన కారు: నలుగురు మృతి
కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. దీంతో చెరువులోని నలుగురు విద్యార్థులు మృతి చెందారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ వద్ద ప్రమాదవశాత్తు కారు చెరువులో పడింది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.మృతులు రేవా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. ఆదివారంనాడు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బెంగుళూరు-హైద్రాబాద్ జాతీయ రహదారి 44పై ఈ ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుండి విద్యార్థులు బాగేపల్లి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చిక్కబళ్లాపూర్ సమీపంలోని గోపాలకృష్ణ చెరువులో కారు బోల్తా పడింది. కే.ఏ. 03 ఎంటీ 0761 నెంబర్ గల కారులో విద్యార్థులు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగం వల్లే కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోయిందని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. చెరువు నుండి కారుతో పాటు మృతదేహలను వెలికితీశారు. మృతదేహలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతులను గుర్తించాల్సి ఉంది.
గతంలో కూడ దేశవ్యాప్తంగా పలు చోట్ల చెరువులు, కాలువలు, నదుల్లో కార్లు పడిన పలువురు మృతి చెందిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆవనిగడ్డ కరకట్ట పంట కాలువలో ఈ ఏడాది జూలై 17న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రత్నభాస్కర్ అనే వ్యక్తి మరణించాడు.
తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.ఈ ప్రమాదం నుండి ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన 2020 ఫిబ్రవరి 27న చోటు చేసుకుంది.
2020 ఫిబ్రవరి 16న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు మానేరు వంతెనపై నుండి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. కారులోని జెండి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు.
2020 ఫిబ్రవరి 19న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కాలువలో అప్పటి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబ సభ్యులు ప్రయాణీస్తున్న కారు కాలువలో మునిగిపోయింది.